IT: ఐటీ ఉద్యోగులకు ఫ్యాటీ రిస్క్.. దీనికి కారణాలు ఇవేనా!

IT:
మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయిస్ అయితే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం శారీరక శ్రమ లేకపోవడం. ఎక్కడికి వెళ్లకుండా ఒకే ప్లేస్‌లో కూర్చోని వర్క్ చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. అయితే మిగతా వారితో పోలిస్తే ఐటీ ఎంప్లాయిస్ ఎక్కువగా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. దాదాపుగా 84 శాతం మంది ఐటీ ఉద్యోగులు ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే కేవలం ఐటీ ఉద్యోగులే అని కాకుండా శారీరక శ్రమ లేకుండా ఎక్కువ గంటల పాటు కంప్యూటర్ ముందు కూర్చొన్న ప్రతీ ఒక్కరికి కూడా ఈ ఫ్యాటీ లివర్ సమస్య బాగా పెరిగింది. దీన్ని హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా అంటారు. కాలేయ కణాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. ఈ సమస్య వస్తే వెంటనే వైద్యులకు చూపించుకోవాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఫ్యాటీ లివర్ సమస్య అనేది కేవలం కూర్చోని ఉన్నవారికి మాత్రమే కాకుండా.. వంశంపారంపర్యంగా కూడా వస్తుందట. అయితే ఏయే కారణాల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రం అవుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
ఊబకాయం
ఎక్కువ గంటల పాటు డెస్క్ ముందు కూర్చోని ఉంటే ఊబకాయం వస్తుంది. పూర్తిగా శారీరక శ్రమ లేకపోతే శరీరంలో కొవ్వు అధికంగా చేరుతుంది. దీంతో కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బీపీ
వర్క్ వల్ల చాలా మంది ఉద్యోగులు అధిక ఒత్తిడికి గురి అవుతారు. దీంతో రక్తపోటు పెరుగుతుంది. ఇలాంటి సమయాల్లో కాలేయం కొవ్వు పెరిగి.. ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ఆహారం
కొందరు పోషకాలు ఉండే ఫుడ్ కంటే లేని ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల శరీరంలో అధిక మొత్తంలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఏర్పడతాయి. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా పోషకాలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వ్యాయామం
గంటల సమయం కంప్యూటర్ల ముందు కొందరు కూర్చుకొంటారు. కానీ కనీసం వ్యాయామం చేయరు. వ్యాయామం చేసే టైమ్ లేకపోయినా కూడా కనీసం యోగా, మెడిటేషన్ అయినా కూడా చేస్తే కాస్త అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. బాడీకి శారీరక శ్రమ అందేలా ఏదో ఒక పనిచేయాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, బెర్రీలు, ఆకుకూరలు, పండ్లు వంటివి తీసుకుంటే కొంత వరకు ఈ ఫ్యాటీ లివర్ సమస్య రాకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు మద్యం, ధూమపానానికి కూడా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.