French open tittle winner carlos alcaraz: ఏకంగా ఐదున్నర గంటల మ్యాచ్.. నరాలు కట్ అయ్యాయి.. విజేత ఎవరో తెలుసా?

French open tittle winner carlos alcaraz:టెన్నిస్ ప్రపంచంలో స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకొని రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అల్కరాజ్ తన ప్రత్యర్థి అయిన వరల్డ్ నం.1 ఆటగాడు జెన్నిక్ సిన్నర్‌ను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. మొత్తం 5 గంటల 29 నిమిషాల పాటు మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలో సుదీర్ఘ ఫైనల్స్‌లో ఒకటిగా నిలిచింది. టెన్నిస్‌లో 5 గంటలకు పైగా జరిగిన తొలి మ్యాచ్ ఇదే. మ్యాచ్ ఆరంభంలో జెన్నిక్ సిన్నర్‌కు అనుకూలంగా సాగింది. అతను తన అద్భుతమైన ఆటతీరుతో అల్కరాజ్ను మొదటి రెండు సెట్లలో ఒత్తిడికి గురిచేశాడు. ఫస్ట్ సిన్నర్ దూకుడుగా ఆడి అల్కరాజ్ సర్వీస్‌ను 10వ గేమ్‌లో బ్రేక్ చేసి 6-4 తేడాతో సులభంగా గెలుచుకున్నాడు. రెండో సెట్లోనూ సిన్నర్ తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఆరంభంలోనే 3-0 లీడ్‌తో అల్కరాజ్ను నిస్సహాయ స్థితిలోకి నెట్టాడు. అయితే, అల్కరాజ్ కూడా అంత తేలిగ్గా లొంగిపోలేదు. అతను పుంజుకుని సెట్‌ను టై బ్రేకర్‌కు తీసుకెళ్లాడు. టై బ్రేకర్‌లో ఇద్దరూ కూడా గట్టిగానో పోటీపడ్డారు. ఇందులో సిన్నర్ 7-4 తేడాతో విజయాన్ని అందుకున్నాడు. దీంతో అల్కరాజ్ రెండు సెట్లు కోల్పోయి 0-2తో వెనుక ఉండిపోయాడు. ఈ స్థితిలో మ్యాచ్ సిన్నర్‌కు ఏకపక్షంగా మారుతుందని అంతా భావించారు.
రెండు సెట్లు కోల్పోయిన తర్వాత కార్లోస్ అల్కరాజ్ తన ఆటతీరును మార్చుకున్నాడు. అతనిలో కొత్త శక్తి వచ్చిందా అన్నట్లుగా దూకుడుగా ఆడాడు. మూడో సెట్లో అద్భుతమైన షాట్లతో సిన్నర్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. 6-4 తేడాతో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సెట్ గెలుపు అల్కరాజ్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నాలుగో సెట్ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. ఇద్దరు ఆటగాళ్లు తమ సర్వీసులను పటిష్టంగా కాపాడుకుంటూ వచ్చారు. ఒక్కో పాయింట్ కోసం పోరాడుతూ ఈ సెట్‌ను టై బ్రేకర్‌కు తీసుకెళ్లారు. టై బ్రేకర్‌లో అల్కరాజ్ తన అనుభవాన్ని, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. 7-6(7-3) తేడాతో ఈ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో సెట్‌కు దారితీసింది.
ఐదో సెట్లో కూడా ఇద్దరు ఆటగాళ్ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. ప్రతి పాయింట్ ఒక గేమ్ పాయింట్‌గా మారడంతో అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. సెట్ చివరి వరకు సమంగా సాగింది. ఇద్దరూ తమ సర్వీసులను కాపాడుకుంటూ వచ్చారు. చివరకు ఐదో సెట్ కూడా టై బ్రేకర్‌కు చేరింది. ఈ టై బ్రేకర్‌లో అల్కరాజ్ తన అసలైన ఆటను ప్రదర్శించాడు. సిన్నర్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అద్భుతమైన పాయింట్లతో దూసుకుపోయాడు. చివరికి 10-2 తేడాతో ఘన విజయం సాధించి ఫ్రెంచ్ ఓపెన్ 2025 టైటిల్‌ను గెలుచుకున్నాడు. అల్కరాజ్ ఈ గెలుపుతో వరుసగా రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడాడు. ఈ విజయంతో కార్లోస్ అల్కరాజ్ తన ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే అల్కరాజ్ యూఎస్ ఓపెన్ (2022), వింబుల్డన్ (2023, 2024), ఫ్రెంచ్ ఓపెన్ (2024) టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. రెండు సెట్లు కోల్పోయినప్పటికీ, తన పట్టుదలతో తిరిగొచ్చి టైటిల్ గెలవడం అతని అద్భుతమైన మానసిక స్థైర్యాన్ని తెలియజేస్తుంది. ఈ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలో ఒక మరపురాని ఫైనల్‌గా మిగిలిపోతుంది. అల్కరాజ్ టెన్నిస్ దిగ్గజంగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.