CBSE: ఇకపై ఏడాదికి రెండుసార్లు సీబీఎస్‌ఈ పరీక్షలు.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే?

CBSE: పదో తరగతి విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది అనగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. అయితే ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారికంగా ప్రకటించలేదు. సాధారణ స్టేట్ సిలబస్‌తో పోలిస్తే.. సీబీఎస్‌ఈ సిలబస్ చాలా కష్టంగా ఉంటుంది. దీంతో విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతున్నారు. ఈ క్రమంలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పరీక్షల విషయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా మంచి మార్కులు సాధించేందుకు ఈ విధానాన్ని తీసుకురావాలని సీబీఎస్‌ఈ ప్లాన్ చేస్తోంది. దీని వల్ల విద్యార్థులు కూడా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉంటారు.
ఇదిలా ఉండగా సీబీఎస్ఈ సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని గతేడాది భావించారు. అయితే ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే ఈ నిర్ణయంపై ముసాయిదా కమిటీ కూడా వేశారు. ఫిబ్రవరి 24 నుంచి ఎవరైనా కూడా ఈ విషయంలో సూచనలు, సలహాలు ఇవ్వచ్చని తెలిపింది. ఇదే కనుక జరిగితే విద్యార్థులకు కాస్త ఒత్తిడి తగ్గుతుందని చెప్పవచ్చు. అయితే సీబీఎస్ఈ పరీక్షలకు డబుల్ బోర్డు విధానం అమలు అయితే మాత్రం.. ఫిబ్రవరి, మే నెలల్లో రెండు సార్లు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు ఏదో ఒక పరీక్ష లేదా రెండింటికీ కూడా హాజరు కావచ్చు. ఈ రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మార్కులు డిసైడ్ చేస్తారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 10వ తేదీ వరకు జరుగుతాయి. అయితే సీబీఎస్‌ఈ ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. సీబీఎస్‌ఈ పరీక్షలు అంటే విద్యార్థులు చాలా ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఈ పరీక్షలు చాలా కష్టంగా ఉంటాయి. ఎంత కష్టపడి చదివినా ఎక్కువ స్కోరింగ్ చేయడం చాలా కష్టం. కాబట్టి చాలా మంది విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి గురి అవుతుంటారు. ఈ కారణం వల్లనే సీబీఎస్‌ఈ ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.