Mudragada Health: ముద్రగడకు తీవ్ర అస్వస్థత.. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసిన జగన్!
Mudragada Health ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. 1978లో జనతా పార్టీ ( Janatha Party )తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.

Mudragada Health: ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham ) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కాకినాడలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల కిందట ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు షుగర్ లెవెల్స్ పడిపోయాయి. దీంతో వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించాలని అక్కడ వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అయితే రోడ్డు మార్గం గూండా కాకుండా.. ఎయిర్ అంబులెన్స్ లో వెళ్లాలని సూచించడంతో పునరాలోచనలో పడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
* జగన్ ఆదేశాలతో..
ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురికావడంతో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )ఆరా తీశారు. ఆయన కుమారుడు గిరి కి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి పరిస్థితిని గిరి జగన్మోహన్ రెడ్డికి వివరించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ముఖ్య నేతలతో మాట్లాడి ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయించారు. ఈరోజు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ అంబులెన్స్ లో ముద్రగడ పద్మనాభం ను హైదరాబాద్ తరలించనున్నారు. అక్కడ యశోద ఆసుపత్రిలో చేరిన తరువాత ఆయన కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్ తరలించిన తరువాతే ముద్రగడ పద్మనాభం ఆరోగ్యానికి సంబంధించి బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.
* సుదీర్ఘ నేపథ్యం..
ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. 1978లో జనతా పార్టీ ( Janatha Party )తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో కూడా పని చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ముద్రగడ ఉద్యమ బాట పట్టారు. అప్పట్లో పలు కేసుల్లో కూడా చిక్కుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నిలిపివేశారు. వైసీపీకి ప్రయోజనం చేకూర్చేందుకే ఉద్యమం చేపట్టారని ఆయనపై విమర్శ ఉంది. అయితే 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అవి వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ముద్రగడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. కుమారుడు గిరి ప్రత్తిపాడు వైసిపి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేస్తానని ముద్రగడ ఇటీవల ప్రకటన చేశారు. ఇంతలోనే అనారోగ్యానికి గురయ్యారు.