Diamond Formation : వజ్రాలు ఎలా ఏర్పడతాయి ? భూమి లోపల జరిగే వింత ప్రక్రియ ఇదే

Diamond Formation : వజ్రం… ఈ పేరు వినగానే మన కళ్ల ముందు మెరిసే ఒక అందమైన రాయి కనిపిస్తుంది. ఇది ఆభరణాలకు, అలంకరణకు మాత్రమే కాదు, పారిశ్రామికంగా కూడా చాలా ముఖ్యమైంది. కానీ, ఇంత విలువైన వజ్రాలు అసలు ఎలా ఏర్పడతాయి? అవి భూమి లోపల నుంచి మన దగ్గరికి ఎలా వస్తాయి? అసలు రంగు లేని వజ్రాలకు వేర్వేరు రంగులు ఎలా వస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా ? ఈ ఆసక్తికరమైన విషయాలను ఈ వార్తలో తెలుసుకుందాం.
వజ్రాలు భూమి లోపల చాలా చాలా లోతులో పుడతాయి. ఈ ప్రదేశాన్ని ఎర్త్ మాంటిల్ అంటారు. ఇది భూమి పై పొర కింద ఉండే ఒక పొర అన్నమాట. అక్కడ వందల కిలోమీటర్ల లోతులో ఊహించలేనంత ఎక్కువ వేడి ఉంటుంది (900-1300 డిగ్రీల సెల్సియస్). అలాగే, భారీ పీడనం కూడా ఉంటుంది. ఈ తీవ్రమైన వేడి, పీడనం కారణంగానే భూమి లోపల ఉన్న కార్బన్ అణువులు కలిసి గట్టిగా మారి, వజ్రాలుగా తయారవుతాయి. ఇది ఒక స్ఫటికీకరణ ప్రక్రియ.
Read Also:Cockroach : బొద్దింక తల తెగినా బతుకుతుందా .. 2నెలలు తిండి లేకుండా ఉంటుందట.. నిజమేనా ?
మరి ఇంత లోతులో ఏర్పడిన వజ్రాలు మన చేతికి రావడంలో అగ్ని పర్వతాల పాత్ర కీలకం. భూమి లోపల ఉండే అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు, ఆ లావాతో పాటు ఈ వజ్రాలు కూడా పైకి చిమ్మబడతాయి. అగ్ని పర్వతం నుంచి వచ్చిన లావా చల్లారిన తర్వాత, వానలు, వరదల వల్ల ఆ రాళ్ళతో పాటు వజ్రాలు కూడా నదుల్లోకి కొట్టుకుపోతాయి. అలా అవి నదీతీరాల్లోని రాళ్ల మధ్య లేదా భూమిలోని పొరలలో ఉండిపోతాయి. అప్పుడే వాటిని తవ్వకాలు చేసి బయటికి తీస్తారు.
సాధారణంగా, స్వచ్ఛమైన వజ్రాలకు రంగు ఉండదు. అవి పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. కానీ రకరకాల రంగుల వజ్రాలను చూస్తుంటాం కదా? అవి ఎలా వస్తాయంటే వజ్రాలు ఏర్పడేటప్పుడు పది లక్షల కార్బన్ అణువుల మధ్య ఒక బోరాన్ అణువు కలిస్తే, ఆ వజ్రం నీలిరంగులోకి మారుతుంది. అలాగే కార్బన్ అణువుల మధ్య నైట్రోజన్ కలిస్తే, ఆ వజ్రం పసుపు రంగులోకి వస్తుంది. వజ్రం ఏర్పడేటప్పుడు కార్బన్ అణువుల ఆకృతి సరిగ్గా ఏర్పడకపోతే లేదా వాటి నిర్మాణంలో లోపాలు ఉంటే, ఆ వజ్రం గోధుమ రంగులోకి మారుతుంది. ఒకవేళ ఆ వజ్రం రేడియేషన్ ప్రభావానికి గురైతే, అది ఆకుపచ్చ వజ్రంగా తయారవుతుంది. వజ్రాల రంగులు వాటిలో ఉండే చిన్న చిన్న మలినాలు లేదా వాటి నిర్మాణంలో ఉండే లోపాల వల్లే వస్తాయి. అందుకే ప్రతి రంగు వజ్రం చాలా ప్రత్యేకంగా, అరుదుగా ఉంటుంది.
Read Also:Neer Mahal : సరస్సు మధ్యలో సుందరమైన ప్యాలెస్.. ఎక్కడ ఉందో తెలుసా ?