Citroen C3 : స్పోర్టీ లుక్, సరికొత్త కలర్ తో సిట్రోయెన్ C3 స్పోర్ట్ ఎడిషన్ లాంచ్

Citroen C3 : భారత మార్కెట్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు సిట్రోయెన్ (Citroen) కంపెనీ నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ సిట్రోయెన్ C3 సరికొత్త స్పోర్ట్ ఎడిషన్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. కస్టమర్లను మరింత ఆకర్షించే విధంగా ఈ కొత్త ఎడిషన్‌లో ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్, స్పోర్టీ డెకాల్స్, మెరుగైన ఫీచర్లను అందిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయం వెనుక ఒక కారణం కూడా ఉంది. గత నెల అంటే మే 2025లో సిట్రోయెన్ కేవలం 333 యూనిట్ల అమ్మకాలతో నిరాశాజనకమైన పనితీరును కనబరిచింది. అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో వాటిని పెంచుకోవడానికి కంపెనీ ఈ కొత్త మోడల్‌ను విడుదల చేసిందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
సిట్రోయెన్ C3 స్పోర్ట్ ఎడిషన్‌ను మరింత పవర్ ఫుల్ గా మార్చేందుకు, దీనిలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 110 బ్రేక్ హార్స్ పవర్ (bhp)పవర్, 205 న్యూటన్ మీటర్ల (Nm) పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ కారు కేవలం 10 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది డ్రైవింగ్‌ను మరింత ఉత్సాహభరితంగా మారుస్తుంది. ట్రాన్స్మిషన్ విషయానికొస్తే.. ఈ కారు ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కొనుగోలు చేయవచ్చు. ఇది వినియోగదారులకు డ్రైవింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది.
Read Also: Prabhas : ఆ సినిమా తర్వాత ఏకంగా 6 వేల పెళ్లి ప్రపోజల్స్.. 45ఏళ్లలోనూ ఇంకా ఒంటరిగానే స్టార్ హీరో
సిట్రోయెన్ C3 స్పోర్ట్ ఎడిషన్‌తో పాటు ‘గార్నెట్ రెడ్’ అనే సరికొత్త రెడ్ కలర్ అందిస్తున్నారు. ఇది కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది. అంతేకాకుండా, సిట్రోయెన్ C3 స్పోర్ట్ ఎడిషన్‌తో కొన్ని అదనపు ఫీచర్లు కూడా లభిస్తున్నాయి, వీటి కోసం అదనంగా రూ.15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ‘ఆప్షనల్ టెక్ కిట్’లో భాగంగా డాష్‌క్యామ్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి ఆధునిక ఫీచర్లు అందించారు. ఇవి డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ మరింత మెరుగుపరుస్తాయి.
వీటితో పాటు ఈ స్పోర్ట్ ఎడిషన్‌లో ‘స్పోర్ట్’ థీమ్‌తో కూడిన డెకాల్స్, యాంబియెంట్ లైటింగ్, స్పోర్టీ పెడల్ కిట్, ‘స్పోర్ట్’ థీమ్‌తో ఉన్న సీట్ అప్హోల్స్ట్రీ, కార్పెట్ మ్యాట్స్, కుషన్డ్ సీట్‌బెల్ట్‌లు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ కారుకు ప్రీమియం, స్పోర్టీ లుక్‌ను అందిస్తాయి. సిట్రోయెన్ C3 స్పోర్ట్ ఎడిషన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.23 లక్షలుగా నిర్ణయించింది. ఈ కొత్త ఎడిషన్ ద్వారా తగ్గుతున్న అమ్మకాలకు పుంజుకోవాలని సిట్రోయెన్ ఆశిస్తోంది. మరి ఈ స్పోర్ట్ ఎడిషన్ భారత మార్కెట్లో ఎంతవరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.