Honda : హోండా మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. 90 నిమిషాల్లో చార్జ్.. 170 కి.మీ రేంజ్

Honda : ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి ఆటోమొబైల్ దిగ్గజం హోండా ఎంట్రీ ఇచ్చింది. ఇది తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు ‘హోండా E-VO’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ బైక్‌ను మొదట చైనా మార్కెట్లో విడుదల చేశారు. అయితే, త్వరలోనే కంపెనీ దీనిని ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. చైనాలో హోండా తన లోకల్ పార్ట్నర్ గువాంగ్జౌతో కలిసి ఈ బైక్‌ను తయారు చేస్తోంది. హోండా మొదటి ఈ-మోటార్‌సైకిల్ ఒక ‘కేఫ్ రేసర్’ స్టైల్ బైక్. ఇది ఆధునిక ఫీచర్లతో రెట్రో టచ్‌ను కలిగి ఉంది.
డిజైన్, స్టైల్
కొత్త హోండా E-VO తన స్టైలిష్ డిజైన్‌తో అదరగొట్టేసింది. ఈ మోడల్లో రౌండ్ హెడ్‌ల్యాంప్ ఉంది. దీని చుట్టూ బబుల్-టైప్ ఫెయిరింగ్ ఉంటుంది. ఇది బైక్ మిగిలిన భాగాలతో కలిసిపోతుంది. బైక్‌కు పూర్తి-ఫెయిర్డ్ స్టైల్ ఇవ్వడానికి సైడ్ ప్యానెల్స్ కవర్ అయి వచ్చాయి. ఇది కొంచెం బాక్సీ లుక్‌ను ఇస్తుంది. E-VOలో సింగిల్-పీస్ సీటును ఉపయోగించారు. క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్, బార్-ఎండ్ మిర్రర్స్ బైక్ లుక్‌ను ఇస్తున్నాయి. ఈ ఈ-బైక్‌లో 16-అంగుళాల ఫ్రంట్, 14-అంగుళాల వెనుక అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
రేంజ్, చార్జింగ్
E-VOలో 15.3 kW PMS ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది 20.5 bhp పవర్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ను ఫోర్జ్డ్ అల్యూమినియం ఛాసిస్ (చట్రం)పై తయారు చేశారు. బ్యాటరీ సైడ్ ప్యానెల్ కింద అమర్చబడి ఉంటుంది. బైక్‌లో రెండు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఒకటి 4.1 kWh, మరొకటి 6.3 kWh. ఇవి వరుసగా 120 కి.మీ, 170 కి.మీ రేంజ్‌ను అందిస్తాయి. ఈ బైక్ బరువు సుమారు 143 కిలోలు. 4.1 kWh వేరియంట్‌ను ఒక గంట 30 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు. అయితే 6.2 kWh వేరియంట్‌ను రెండు గంటల 30 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు.
ఫీచర్లు, ధర
ఫీచర్ల విషయానికి వస్తే.. హోండా E-VO ముందు భాగంలో డాష్ కామ్‌ను కూడా అందిస్తుంది. బైక్‌లో TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఇందులో నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. E-VOలో మూడు రైడింగ్ మోడ్లు ఉంటాయి. హోండా E-VO ఇప్పుడు చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంది. దీని ధర 37,000 యువాన్ (మన కరెన్సీలో సుమారురూ.4.39 లక్షలు). అయితే, E-VO భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ప్రస్తుతం తక్కువగానే ఉంది. కంపెనీ ఇటీవల QC1, Activa e మోడల్స్‌తో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి అడుగుపెట్టింది. సమీప భవిష్యత్తులో బ్రాండ్ వాటిపైనే దృష్టి సారించే ఛాన్స్ ఉంది.
Read Also:Health Tips: ఈ చింతకాయ తింటే.. నూరేళ్లు ఆరోగ్యం పక్కా