Credit Card : క్రెడిట్ కార్డు ఫ్రెండ్స్ కి ఇస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త

Credit Card : ఈ రోజుల్లో చాలా మంది జేబుల్లో క్రెడిట్ కార్డులు ఉండడం చాలా కామన్ అయిపోయింది. చిన్న అవసరం వచ్చినా, ఆన్లైన్లో షాపింగ్ చేయాలన్నా, క్రెడిట్ కార్డు చాలా హెల్ప్ చేస్తుంది. అయితే, కొందరు ఫ్రెండ్స్ మధ్య ‘నా కార్డ్ తీసుకో, అవసరమైతే వాడుకో’ అని చెప్పేస్తుంటారు. కానీ, ఇలా చేయడం ఎంత ప్రమాదమో ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ ఫ్రెండ్ కోసం మీ క్రెడిట్ కార్డు ఇస్తే, మీ డబ్బు, మీ ఫ్రెండ్షిప్ రెండూ చెడిపోయే ప్రమాదం ఉంది. ఫ్రెండే కదా, ఏం చేస్తాడని అనుకోవచ్చు కానీ.. కొన్నిసార్లు స్నేహం, ఆర్థిక విషయాలు కలిసినప్పుడు చాలా సమస్యలు వస్తాయి. మీ ఫ్రెండ్ మీ క్రెడిట్ కార్డ్‌తో ఖర్చు చేసి, బిల్లు కట్టకపోతే ఏం చేస్తారు? అడగలేక, వదిలేయలేక చాలా ఇబ్బంది పడతారు. ఇది ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పూర్తిగా పాడు చేస్తుంది.
మీ ఫ్రెండ్ గనుక టైమ్‌కి బిల్లు చెల్లించకపోతే, ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోర్‌పై పడుతుంది. క్రెడిట్ స్కోర్ తక్కువైతే, భవిష్యత్తులో మీరు బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలన్నా కొత్త క్రెడిట్ కార్డు కావాలన్నా చాలా కష్టమవుతుంది. మీ కార్డ్‌ను మీ ఫ్రెండ్ వాడినా, బ్యాంకుల రికార్డుల్లో అకౌంట్ హోల్డర్ మీరే కాబట్టి, బిల్లు చెల్లించకపోయినా ఏదైనా సమస్య వచ్చినా బ్యాంకులు మీ ఫ్రెండ్‌ను అడగవు. మిమ్మల్నే విచారిస్తాయి.
Read Also: The Family Man : ఫ్యామిలీ మ్యాన్ 3 టీజర్ వచ్చేసింది.. మాస్టర్ పీస్ అంటున్న మనోజ్ ఫ్యాన్స్
మీ ఫ్రెండ్ నిజంగానే అమాయకుడు కావచ్చు. కానీ, ఒకవేళ మీ కార్డ్‌ను ఇంకొకరికి ఇచ్చినా, లేదా ఆన్లైన్లో సైట్లలో ఉపయోగిస్తున్నప్పుడు మోసగాళ్లు ఆ వివరాలు తస్కరించినా, అది మీకు పెద్ద తలనొప్పి అవుతుంది. ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్‌తో ఏదైనా మోసపూరిత లావాదేవీ జరిగిందని మీరు బ్యాంకుకు ఫిర్యాదు చేసినా, మీరు మీ ఫ్రెండ్‌కు కార్డ్ ఇచ్చారని బ్యాంకుకు తెలిస్తే, మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, క్రెడిట్ కార్డ్ నిబంధనల ప్రకారం.. కార్డ్ హోల్డర్ మాత్రమే దాన్ని వాడాలి. ఇంకొకరికి ఇవ్వడం అనేది నిబంధనల ఉల్లంఘన అవుతుంది.
అత్యవసరంగా మీ ఫ్రెండ్‌కి డబ్బు అవసరమైతే, క్రెడిట్ కార్డ్ ఇవ్వడం కంటే మీరే డైరెక్ట్‌గా డబ్బు ఇవ్వడం మంచిది అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల మీరు ఎంత డబ్బు ఇస్తున్నారో, దాన్ని ఎలా తిరిగి పొందాలో మీకు ఓ క్లారిటీ ఉంటుంది. మీ ఫ్రెండ్ డబ్బు తిరిగి ఇవ్వకపోయినా అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపదు. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ ఇవ్వాల్సి వస్తే, ఖర్చు చేయడానికి ముందుగానే ఒక లిమిట్ పెట్టుకొని, ఆ లిమిట్‌ను మించకుండా చూసుకోవాలి. ఇంకా, మీ ఫ్రెండ్ చేసిన ఖర్చులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి. మొత్తానికి, క్రెడిట్ కార్డ్ విషయంలో మీది మీదే, ఫ్రెండ్ ది ఫ్రెండే అని గుర్తుంచుకోవాలి. చిన్న సాయం అనుకుంటే అది పెద్ద కష్టంలోకి నెట్టే ప్రమాదం ఉంది.
Read Also: Fancy Number : ఒక్క నంబర్ కు లక్షల ఖర్చు.. ఖైరతాబాద్ ఆర్టీఏకు ఒక్క రోజే రూ.42లక్షల ఆదాయం