Viral: మామతో పెళ్లికి అడ్డంగా ఉన్నాడని భర్తను సుపారీ ఇచ్చి చంపించిన భార్య

Viral: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసును తలపించేలా మరో షాకింగ్ ఘటన బీహార్‌లో వెలుగు చూసింది. పెళ్లైన కేవలం 45 రోజులకే తన భర్తను చంపడానికి ఓ నవ వధువు కుట్ర పన్నింది. ఈ దారుణం బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న భార్యను, ఆమెకు సహాయం చేసిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలు వింటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియాంశు కుమార్ సింగ్(32) అనే వ్యక్తి జూన్ 24 రాత్రి నబీనగర్ రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మొదట, ఇది ఒక కాంట్రాక్ట్ కిల్లింగ్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.
అయితే, దర్యాప్తు కొనసాగే కొద్దీ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ హత్య వెనుక ప్రియాంశు భార్య గుంజ సింగ్ ఉందని, ఆమె తన మేనమామ , జీవన్ సింగ్ తో కలిసి ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు గుర్తించారు. నిందితురాలు తన మేనమామ జీవన్ సింగ్‌తో గత 15ఏళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ బంధం కారణంగా ఆమెకు పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదట. అయినప్పటికీ, కుటుంబ సభ్యుల ఒత్తిడితో మే నెలలో ప్రియాంశును పెళ్లి చేసుకుంది.
Read Also:3BHK movie full review: 3BHKతో హీరో సిద్దార్థ్ మరోసారి హిట్ కొట్టాడా?
పెళ్లి తర్వాత కూడా మేనమామతో తన సీక్రెట్ ఎఫైర్ కొనసాగించడం గుంజకు కష్టమైందట. అందుకే, భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ఈ ఆలోచనకు ఆమెకు ఇటీవలి మేఘాలయ హనీమూన్ హత్య కేసు స్ఫూర్తినిచ్చిందని అక్కడి ఎస్పీ అంబరీష్ రాహుల్ చెప్పారు. ఆ కేసులో కూడా ఒక భార్య తన హనీమూన్‌లోనే భర్తను హత్య చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. జీవన్ సింగ్ ఈ హత్య కోసం జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాకు చెందిన జైశంకర్ చౌబే, ముఖేష్ శర్మ అనే ఇద్దరితో కలిసి కిరాయి హంతకులను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. వీరు సిమ్ కార్డులు సమకూర్చడం, లాజిస్టికల్ సపోర్ట్ ఇవ్వడంలో సాయం చేశారు. హత్య జరిగిన రాత్రి, ప్రియాంశు వారణాసి నుండి తిరిగి వస్తూ, తాను ఎక్కడ ఉన్నాడో భార్య గుంజకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ సమాచారాన్ని గుంజ సింగ్ వెంటనే కిరాయి హంతకులకు చెప్పిందని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమాచారం ఆధారంగానే హంతకులు ప్రియాంశును కాల్చి చంపారు. గుంజ సింగ్‌ను బుధవారం అరెస్ట్ చేయగా, విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. ఆమెకు సహకరించిన మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడైన జీవన్ సింగ్ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also:Balaji Srinivasan : సింగపూర్ పక్కన టెకీల కోసం కొత్త దేశాన్ని నిర్మిస్తున్న భారతీయుడు