Sidhu Jonnalagadda : సినిమా ఫ్లాప్.. రూ.4కోట్లు తిరిగిచ్చిన హీరో సిద్ధు జొన్నలగడ్డ

Sidhu Jonnalagadda : నేటి సినిమాల బడ్జెట్లు హద్దులు దాటుతున్నాయి. సినిమా మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ హీరో హీరోయిన్లకు చెల్లిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌తో సహా, దక్షిణాదిలోని చాలా మంది నిర్మాతలు నటీనటుల పారితోషికాలు పెరిగిపోవడంపై ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త నటీనటులు కూడా ఇప్పుడు కోట్లల్లో పారితోషికాలు తీసుకుంటున్నారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా వారికి పెద్దగా సంబంధం ఉండదు. కానీ, ఇక్కడ ఒక హీరో మాత్రం తన సినిమా ఫ్లాప్ అవ్వడంతో తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
టాలీవుడ్ యూత్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. ఆయన నటించిన ‘టిల్లు’ సినిమా భారీ విజయం సాధించింది. ఇటీవల ‘టిల్లు 2’ కూడా విడుదలై అది కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే, ఆ తర్వాత సిద్ధు నటించిన ‘జాక్’ అనే సినిమా ఏప్రిల్ 10, 2025న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇది నిర్మాతలకు భారీ నష్టాలను కలిగించింది. ఈ కారణంగానే సిద్ధు తాను సినిమాకు తీసుకున్న పారితోషికంలో కొంత భాగాన్ని తిరిగి ఇచ్చేశారు.
Read Also:Cancer: గ్లోబల్ వార్మింగ్‌తో.. క్యాన్సర్‌కు ఏదైనా సంబంధం ఉందా?
‘జాక్’ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, రా ఏజెంట్ కావాలని కలలు కనే యువకుడి పాత్రలో నటించారు. సినిమాలో హీరోయిన్గా వైష్ణవి చైతన్య నటించింది. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.30 కోట్లుగా అంచనా వేశారు. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కేవలం రూ.10 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. దీంతో సిద్ధు తాను సినిమాకు తీసుకున్న పారితోషికంలో రూ.4 కోట్లను తిరిగి ఇచ్చారు. నిర్మాతలు ఎదుర్కొన్న భారీ నష్టాన్ని పూడ్చే ఉద్దేశ్యంతో ఆయన ఈ గొప్ప పని చేశారు. సిద్ధు తీసుకున్న ఈ నిర్ణయం సినీ ప్రియుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
సిద్ధు జొన్నలగడ్డ అనేక సినిమాలలో చిన్న పాత్రలలో నటించి క్రమంగా స్టార్ హీరోగా ఎదిగారు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్ విజయాలతో యువతలో విశేషమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం సిద్ధు ‘తెలుసు కదా’ (Telusu Kada), ‘టిల్లు క్యూబ్’ (Tillu Cube) అనే సినిమాలలో నటిస్తున్నారు. ‘తెలుసు కదా’ సినిమాలో సిద్ధుతో పాటు శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్గా నటిస్తున్నారు.
Read Also:Viral Video : తమిళనాడు తీరంలో చిక్కిన అరుదైన ఒర్ఫిష్.. భయాందోళనలో మత్స్యకారులు!