Miraculous Surgery: తాత పిత్తాశయంలో 8వేల రాళ్లు.. ఇంతకాలం ఎలా బతికావయ్యా ?

Miraculous Surgery: శరీరంలో రాళ్లు (Stone formation) చాలా కారణాల వల్ల ఏర్పడతాయి. వాటి సంఖ్య ఒకటి, రెండు లేదా మహా అయితే పది వరకు ఉండొచ్చు. కానీ, 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయంలో (Gallbladder) ఏకంగా 8 వేలకు పైగా రాళ్లు ఏర్పడ్డాయి. వీటిని తీయడం కష్టమే అనిపించినా డాక్టర్లు అద్భుతమైన ఆపరేషన్ చేసి అన్ని రాళ్లను విజయవంతంగా తొలగించారు. కేవలం ఒక గంట సర్జరీతో డాక్టర్లు ఆ వృద్ధుడి ప్రాణాలను కాపాడారు. ఈ అసాధారణ సర్జరీ గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు నిర్వహించారు.
డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం.. పిత్తాశయంలోని రాళ్లను లెక్కించడానికి టీమ్‌కు దాదాపు ఆరు గంటలు పట్టింది. ఆశ్చర్యకరంగా, తన శరీరంలో ఇన్ని రాళ్లు ఉన్నాయని ఆ వృద్ధుడికి కూడా అస్సలు తెలియదు. అయితే, ఆయనకు చాలా సంవత్సరాలుగా ఆకలి తగ్గడం, కడుపు నొప్పి, ఛాతీ, వీపులో బరువుగా అనిపించడం వంటి సమస్యలు ఉండేవి. ఆయన్ని ఆసుపత్రిలో చేర్చిన తర్వాత, కడుపు అల్ట్రాసౌండ్ చేయగా, ఇన్ని రాళ్లు ఉన్నాయని తెలిసింది. వెంటనే ఆయనకు ల్యాప్రోస్కోపిక్ పిత్తాశయం తొలగింపు సర్జరీ (Laparoscopic Gallbladder Removal Surgery) చేశారు. ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు.
Read Also:Actress Tamanna : జాక్ పాట్ కొట్టిన తమన్నా.. ఆ బ్రాండ్ కు ఏకంగా రూ. 6.20 కోట్లు!
ఇన్ని రాళ్లు ఎలా ఏర్పడ్డాయి?
ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అమిత్ జావేద్, డాక్టర్ నరోలా యెంగర్ మాట్లాడుతూ.. రోగిని చేర్చిన తర్వాత చేసిన అల్ట్రాసౌండ్‌లో చాలా ఎక్కువ రాళ్లు ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. వెంటనే సర్జరీ చేయాలని నిర్ణయించి, పిత్తాశయంలో పేరుకుపోయిన వేలకొలది రాళ్లను తొలగించారు. డాక్టర్ల ప్రకారం.. సర్జరీని తక్షణమే చేయడం చాలా అవసరం. ఆలస్యం చేసి ఉంటే, అది ఫైబ్రోసిస్‌కు దారితీసేది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి, ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.
పిత్తాశయంలోని రాళ్ల నొప్పి ఎక్కడ ఉంటుంది?
పిత్తాశయంలోని రాళ్ల నొప్పి సాధారణంగా కడుపు పైభాగంలో కుడి వైపున ఉంటుంది. ఇది నొప్పికి అత్యంత సాధారణ ప్రదేశం. నొప్పి కుడి వైపు వీపులో కూడా, ముఖ్యంగా భుజం బ్లేడ్ కింద, అనిపించవచ్చు. కొంతమందిలో నొప్పి కుడి భుజం వరకు కూడా వ్యాపించవచ్చు. పిత్తాశయంలోని రాళ్ల నొప్పి తరచుగా అకస్మాత్తుగా మొదలై, కొన్ని నిమిషాల నుంచి అనేక గంటల వరకు ఉంటాయి. అకస్మాత్తుగా కడుపులో తీవ్రమైన నొప్పి కూడా రావచ్చు.
పిత్తాశయంలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?
ఒక వ్యక్తి పిత్తంలో (bile) బిలిరుబిన్ (Bilirubin) లెవల్స్ పెరిగినప్పుడు రాళ్లు ఏర్పడతాయి. కొంతమందిలో కాలేయం (Liver) కూడా ఎక్కువ బిలిరుబిన్ను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి. సాధారణంగా, ఆహారపు అలవాట్ల కారణంగా ఇది జరుగుతుంది. చాలా సందర్భాలలో సంవత్సరాల తరబడి రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ రోగికి అస్సలు తెలియదు. సరైన ఆహారం, జీవనశైలితో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఇలాంటి సమస్యలను నివారించవచ్చు.