Drunk and Drive Test : ఆల్కహాల్ తీసుకోకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిందా..?

Drunk and Drive Test : కొన్ని సార్లు ఆల్కహాల్ తీసుకోకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఆశ్చర్యంగా అనిపించినా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది నిజం. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లలో ప్రధానంగా బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ లేదా శ్వాసలోని ఆల్కహాల్ లెవల్ కొలుస్తారు. మనం ఆల్కహాల్ తీసుకోకపోయినా, కొన్ని పదార్థాలు లేదా ఆరోగ్య పరిస్థితుల వల్ల ఈ టెస్ట్‌లు తప్పుగా పాజిటివ్‌గా చూపించే అవకాశం ఉంటుంది. సాధారణంగా చాలా మౌత్ వాష్‌లు, మౌత్ స్ప్రేలలో ఆల్కహాల్ ఉంటుంది. వీటిని ఉపయోగించిన వెంటనే బ్రీత్‌లైజర్ టెస్ట్ చేస్తే, మీ నోటిలో ఆల్కహాల్ అవశేషాలు ఉండటం వల్ల పాజిటివ్ చూపిస్తుంది. జలుబు, దగ్గు మందులలో ఇథనాల్ అనే ఆల్కహాల్ ఉంటుంది. ఇది కూడా టెస్ట్‌లో కనిపించవచ్చు. కొన్ని యాంటీడిప్రెసెంట్స్ లేదా యాంజియోలైటిక్ మందులు ఆల్కహాల్‌తో కలిసినప్పుడు లేదా అరుదైన సందర్భాల్లో సొంతంగా కూడా తప్పుడు పాజిటివ్‌కు దారితీయవచ్చు.
బాగా పండిన అరటిపండ్లు, ద్రాక్ష మొదలైనవి సహజంగానే పులిసిపోయి కొద్ది మొత్తంలో ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేస్తాయి. వాటిని తిన్నప్పుడు పాజిటివ్ గా వస్తుంది. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి కారణంగా కూడా కడుపులో ఉత్పత్తి అయిన ఆల్కహాల్ అన్నవాహికలోకి తిరిగి వచ్చి బ్రీత్‌లైజర్ టెస్ట్‌ను ప్రభావితం చేయవచ్చు. డయాబెటిస్ ఉన్నవారిలో శరీరం చక్కెరను సరిగా జీర్ణం చేసుకోలేనప్పుడు అసిటోన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది బ్రీత్‌లైజర్ పరికరాలలో ఆల్కహాల్‌గా తప్పుగా గుర్తిస్తుంది.
Read Also:Starlink : భారతదేశంలో ఏ మారుమూలన ఉన్నా.. సిగ్నల్స్ లేకున్నా హై స్పీడ్ ఇంటర్నెట్
View this post on Instagram
కొన్నిసార్లు ఆటో బ్రేవరీ సిండ్రోమ్ అనే అరుదైన ఒక వైద్య పరిస్థితి కారణంగా కూడా బ్రీత్ ఎనలైజర్ టెస్టులో పాజిటివ్ వస్తుంది. సాధారణంగా, మద్యం సేవించిన వారికి మాత్రమే మత్తు వస్తుంది. కానీ, ఈ సిండ్రోమ్ ఉన్నవారికి ఆల్కహాల్ తాగకుండానే శరీరంలో ముఖ్యంగా పేగులలో ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. ఇది వారిని మత్తులో ఉన్నవారిలా ప్రవర్తించేలా చేస్తుంది. మన జీర్ణవ్యవస్థలో సహజంగానే అనేక రకాల బ్యాక్టీరియా, ఈస్ట్‌లు ఉంటాయి. ఇవి ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడతాయి. అయితే, ఆటో బ్రేవరీ సిండ్రోమ్ ఉన్నవారిలో కొన్ని ప్రత్యేక రకాల ఈస్ట్‌లు లేదా కొన్ని రకాల బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థలో అధికంగా పెరిగిపోతాయి.
ఈ ఈస్ట్‌లు లేదా బ్యాక్టీరియా తీసుకున్న కార్బోహైడ్రేట్లను కిణ్వ ప్రక్రియ ద్వారా ఆల్కహాల్‌గా మారుస్తాయి. ఈ ఆల్కహాల్ జీర్ణవ్యవస్థ నుంచి రక్తంలోకి శోషించబడి, మత్తుకు కారణమవుతుంది. బయట నుండి మద్యం తీసుకోకపోయినా ఈ అంతర్గత ఉత్పత్తి కారణంగా వారు ఆల్కహాల్ సేవించిన వారిలా కనిపిస్తారు. ఈ సిండ్రోమ్ ఉన్నవారిలో ఏ కారణం లేకుండానే మత్తుగా, తూలుతున్నట్లు అనిపించడం, తల తిరగడం, నడిచేటప్పుడు తూలడం, మాట్లాడటంలో ఇబ్బంది, వాంతులు, కడుపు నొప్పి, అలసట, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తల నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ మీరు ఆల్కహాల్ తీసుకోకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పాజిటివ్ వస్తే వెంటనే పోలీసులకు మీ పరిస్థితిని వివరించాలి. రక్త పరీక్ష చేయించుకోవాలని కోరాలి. బ్రీత్‌లైజర్ టెస్ట్ కంటే రక్త పరీక్షలు చాలా కచ్చితమైన ఫలితాలను ఇస్తాయి.
Read Also:YouWeCan : సచిన్, కోహ్లీ, పీటర్సన్.. యువీ ఛారిటీ కోసం తరలివచ్చిన క్రికెట్ దిగ్గజాలు!