Watery Eyes Symptoms : కళ్ళలోంచి తరచుగా నీరు కారుతోందా? సాధారణమా, ప్రమాదకరమా?

Watery Eyes Symptoms : మన కళ్ళలోంచి తరచుగా నీరు కారుతుంటే అది అనేక రకాల అనారోగ్యాలకు లక్షణం కావచ్చు. కొన్నిసార్లు ఇది చాలా తీవ్రమైన సమస్య కూడా కావొచ్చు. మీరు కంప్యూటర్, ల్యాప్టాప్ లేదా మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటే డ్రై ఐ (Dry Eye) సమస్య వచ్చే అవకాశం ఉంది. డ్రై ఐ ఉన్నప్పుడు కూడా కళ్ళలోంచి పదేపదే నీరు కారుతుంది. ఒకవేళ డ్రై ఐ సమస్య లేకపోయినా ఇలా జరుగుతుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. కళ్ళలోంచి తరచుగా నీరు కారడం వెనుక ఏయే జబ్బులున్నాయో వివరంగా తెలుసుకుందాం.
కళ్ళలోంచి నీరు కారడానికి సాధారణ కారణాలు
తరచుగా, మన కళ్ళలోంచి ఎటువంటి కారణం లేకుండా నీరు కారుతుంది. ఇది కళ్ళకు సంబంధించిన ఏదైనా తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చు. కళ్ళలో పొడిదనం (dryness) లేదా ధూళి, చిన్న వెంట్రుకలు వంటివి పడినప్పుడు కూడా ఇలా జరగవచ్చు. కొన్నిసార్లు, ధూళి కణాలు కళ్ళలో ఉన్నా, వాటివల్ల దురద లేదా అసౌకర్యం కలగకపోవచ్చు. కానీ, కళ్ళలోని వ్యవస్థ ఆ కణాలను బయటకు పంపించడానికి నీటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇవి కాకుండా, కళ్ళలోంచి పదేపదే నీరు కారడానికి అనేక ఇతర వ్యాధులు కూడా కారణం కావచ్చు.
డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కారణం లేకుండా కళ్లలోంచి నీరు కారుతుంటే అది కన్నీటి గ్రంధి (Tear Gland) సమస్యకు లక్షణం కావచ్చు. కన్నీటి నాళంలో ఏదైనా అడ్డంకి ఉంటే, కళ్ళలోంచి పదేపదే నీరు కారుతుంది. కనురెప్పలలో (Eyelids) ఏదైనా సమస్య ఉన్నా కూడా కళ్ళలోంచి నీరు కారుతుంది. కనురెప్పలు బయటకు లేదా లోపలికి తిరగడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. అంతేకాకుండా, బెల్స్ పాల్సీ (Bell’s Palsy) అనే సమస్య వల్ల కూడా కళ్ళలోంచి నీరు కారవచ్చు. బెల్స్ పాల్సీ అనేది ఒక నరాల సంబంధిత రుగ్మత. దీనివల్ల ముఖ కండరాలు ప్రభావితమవుతాయి. దీని కారణంగా కళ్ళు సరిగ్గా మూసుకోకపోవడం లేదా కనురెప్పలు సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల కూడా కళ్ళలోంచి తరచుగా నీరు కారుతుంది.
మీకు కళ్ళలోంచి పదేపదే నీరు కారుతుంటే, మీరు వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఇలాంటి సమస్యలకు ఇంటి చిట్కాలు లేదా నిర్లక్ష్యం కళ్ళకు చాలా నష్టాన్ని కలిగించవచ్చు. డాక్టర్ మీ కళ్ళను పరీక్షించి, కళ్ళలోంచి నీరు కారడానికి సరైన కారణాన్ని తెలుసుకొని చికిత్సను ప్రారంభిస్తారు. నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రమై, కళ్ళకు తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
Read Also:June Deadlines : జూన్లో ఇవి అస్సలు మర్చిపోవద్దు.. అన్నీ టైమ్లో చేసుకుంటే పర్ఫెక్ట్!