Neeraj Chopra : కపిల్ దేవ్, ధోని సరసన నీరజ్ చోప్రా..సైన్యంలో అత్యున్నత గౌరవం

Neeraj Chopra : భారతదేశపు సక్సెస్ ఫుల్ అథ్లెట్, ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు ఒక గొప్ప గౌరవం లభించింది. రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన నీరజ్ చోప్రాను టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్‌తో సత్కరించారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నీరజ్ చోప్రాను ఈ ర్యాంక్‌తో సత్కరించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. నీరజ్ ఇప్పటికే భారత సైన్యంలో సూబేదార్ మేజర్ పదవిలో ఉన్నారు.
ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం, మే 14న ఒక నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రపతి ఈ నోటిఫికేషన్‌ను మే 9న ఆమోదించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. రాష్ట్రపతి టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులేషన్ కింద తమకున్న అధికారాలను వినియోగిస్తూ నీరజ్ చోప్రాకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్‌ను ప్రదానం చేశారు. నీరజ్ ఈ ర్యాంక్ ఏప్రిల్ 16, 2025 నుంచే అమల్లోకి వచ్చింది.
Read Also : Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. 1152 రోజులుగా నెంబర్ వన్
భారత సైన్యంలోని రాజపుతానా రైఫిల్స్‌లో మొదట సూబేదార్గా, తరువాత సూబేదార్ మేజర్‌గా పనిచేసిన నీరజ్, తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా దేశానికి,సైన్యానికి గొప్ప పేరు తెచ్చాడు. నీరజ్ సైన్యంలో ఉంటూనే 2016లో జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. అదే సంవత్సరంలో అతను సైన్యంలో చేరాడు. తరువాత సూబేదార్ ర్యాంక్‌ను పొందాడు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించి, అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన మొదటి భారతీయుడు అయ్యాడు. దీని తర్వాత అతనికి పదోన్నతి లభించి సూబేదార్ మేజర్ అయ్యాడు. ఈ సమయంలో అతను ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్నాడు. డైమండ్ లీగ్ టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది నీరజ్ పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం కూడా సాధించాడు.
ఒక క్రీడాకారుడికి రాష్ట్రపతి టెరిటోరియల్ ఆర్మీలో ఈ ర్యాంక్‌ను ప్రదానం చేయడం ఇదే మొదటిసారి కాదు. చాలా సంవత్సరాల క్రితం భారతదేశానికి మొట్టమొదటి ప్రపంచ కప్‌ను అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను లెఫ్టినెంట్ కల్నల్‌గా నియమించారు. తరువాత 2011లో ఎంఎస్ ధోని, అభినవ్ బింద్రా కూడా ఈ గౌరవాన్ని పొందారు. ధోని కెప్టెన్సీలో భారత్ ప్రపంచ కప్‌ను గెలుచుకోగా, బింద్రా ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మొదటి భారతీయ క్రీడాకారుడు. అలాగే, గొప్ప బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌ను భారత వైమానిక దళం గౌరవ గ్రూప్ కెప్టెన్‌గా నియమించింది.
Read Also :Goodbye to Your Job: జాబ్‌కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి