Phone Safety : ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..మీ ఫోన్ బాంబులా పేలొచ్చు!

Phone Safety : ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. దాన్ని పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాడుతూనే ఉంటాం. చాటింగ్ చేయడానికైనా, కాల్స్ మాట్లాడటానికైనా, గేమ్స్ ఆడటానికైనా, సోషల్ మీడియా చూడటానికి ఇలా చేతిలో ఫోన్ లేకుండా కాసేపు కూడా ఉండలేకపోతున్నాం. కానీ, ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు పెద్ద ప్రమాదాలకు దారితీయొచ్చు. ప్రతీ ఏటా చాలా కేసులు వస్తున్నాయి, ఫోన్లు ఛార్జింగ్ పెట్టినప్పుడు పేలిపోవడం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతోంది. అందుకే, మన ఫోన్ బాంబులా పేలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
ఛార్జింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి
లోకల్ లేదా నకిలీ ఛార్జర్ వాడొద్దు: లోకల్ లేదా డూప్లికేట్ ఛార్జర్లు కొని వాడవద్దు. తక్కువ ధర అని కొనే ఈ ఛార్జర్లు చాలా ప్రమాదకరం. లోకల్ ఛార్జర్లలో సేఫ్టీ సర్క్యూట్ ఉండదు. దీనివల్ల ఫోన్ ఓవర్‌హీట్ అవ్వొచ్చు లేదా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడూ ఒరిజినల్ లేదా మంచి బ్రాండెడ్ ఛార్జర్లనే వాడండి.
ఛార్జింగ్ అవుతుంటే ఫోన్ ఎక్కువ వాడొద్దు: ఫోన్ ఛార్జ్ అవుతున్నప్పుడు పదే పదే వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం లేదా కాల్స్ మాట్లాడటం చేయవద్దు. అలా చేస్తే ఫోన్ చాలా వేగంగా వేడెక్కుతుంది. దీనివల్ల బ్యాటరీ పేలిపోయే ప్రమాదం పెరుగుతుంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వాడకాన్ని వీలైనంత తగ్గించండి.
Read Also:Heart Attack : పురుషుల కంటే భిన్నంగా మహిళల్లో హార్ట్ ఎటాక్ లక్షణాలు.. నిర్లక్ష్యం చేశారో అంతే
దిండు కింద, పరుపు మీద పెట్టి ఛార్జ్ చేయొద్దు: చాలామంది ఫోన్‌ను ఛార్జ్ పెట్టి దిండు కింద లేదా పరుపు మీద పెట్టేస్తారు. అలా చేస్తే ఫోన్ నుంచి వచ్చే వేడి బయటికి వెళ్లదు. దాంతో ఫోన్ బాగా వేడెక్కి పోతుంది. ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్‌ను చల్లగా, గాలి తగిలే ప్లేస్‌లో పెట్టాలి.
పొరపాటున కూడా రాత్రంతా ఛార్జ్ చేయొద్దు: రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టేసి పడుకోవడం మంచిది కాదు. రాత్రంతా ఛార్జ్ చేస్తే బ్యాటరీపై చాలా ఒత్తిడి పడుతుంది. దానివల్ల అది తొందరగా పాడైపోతుంది. ఓవర్ఛార్జింగ్ వల్ల ఫోన్లో షార్ట్ సర్క్యూట్ కూడా అవ్వొచ్చు. బ్యాటరీ 80 శాతం ఛార్జ్ అవ్వగానే వెంటనే ఛార్జర్‌ను తీసేయాలి.
Read Also:Viral Video : వ్యూస్, లైక్స్ కోసం మరీ ఇంతలా దిగజారాలా.. మెడలో కప్పలతో డ్యాన్స్ చేసిన మహిళ!
ఫోన్ కవర్ తీయకుండా ఛార్జ్ చేయొద్దు: ఫోన్‌కు బ్యాక్ కవర్ ఉంటే, దాన్ని తీయకుండానే ఛార్జ్ చేయడం ప్రమాదకరం. కవర్ దళసరిగా ఉంటే గాలి తగలదు. దీంతో ఛార్జింగ్ సమయంలో ఫోన్ బాగా వేడెక్కుతుంది. ఛార్జింగ్ చేసేటప్పుడు కవర్లను తీసేయండి. అప్పుడు వేడి సులభంగా బయటికి వెళ్తుంది.
ఛార్జింగ్ పోర్ట్‌లో దుమ్ము, నీళ్లు లేకుండా చూసుకోండి: ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ మురికిగా లేదా తడిగా ఉన్నా సరే ఛార్జర్ పెట్టడం మంచిది కాదు. అలా చేస్తే స్పార్కింగ్ (చిన్న మంట) లేదా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉండేలా చూసుకోవాలి.