PM Kisan : పీఎం కిసాన్ 20వ విడుత డబ్బులు రావాలంటే ముందు ఈ 6పనులు చేశారా ?

PM Kisan : దేశవ్యాప్తంగా రైతులకు వ్యవసాయంలో పెట్టుబడులకు సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటివరకు 19 విడతల డబ్బులు విడుదలయ్యాయి. ఇప్పుడు 20వ విడత డబ్బుల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ నెలలోనే 20వ విడత డబ్బులు వస్తాయని చాలామంది ఆశించారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉన్న ఈ కాలానికి సంబంధించిన డబ్బులు ఇదే నెలలో ఖచ్చితంగా విడుదలవుతాయి. అయితే, ఈసారి డబ్బులు అందరికీ వస్తాయా లేదా అనేది ఒక ప్రశ్న. ఈసారి డబ్బులు రావాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని ప్రభుత్వం తెలిపింది.
9 కోట్ల మందికి పైగా నమోదైన రైతుల ఖాతాల్లోకి రూ.2,000ల చొప్పున త్వరలో విడుదల కానుంది. అయితే, పథకంలో నమోదు చేసుకున్న అందరికీ ఈ విడత డబ్బులు వస్తాయని ఖచ్చితంగా చెప్పలేం. కొన్ని రూల్స్ పాటించిన వాళ్లకు మాత్రమే ఈ డబ్బులు అందుతాయి.
పీఎం కిసాన్ షరతులు: ఈ 6 పనులు తప్పనిసరి!
పీఎం కిసాన్ పథకం సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయంపై ఒక పోస్ట్ పెట్టారు. విడత డబ్బులు అందుకోవడానికి లబ్ధిదారులు తప్పకుండా చేసుకోవాల్సిన ఆరు ముఖ్యమైన పనులను అందులో తెలిపారు. అవేంటంటే:
1. ఈ-కేవైసి (e-KYC) పూర్తి చేసి ఉండాలి. ఇది ప్రతి రైతుకు తప్పనిసరి.
2. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ అయి ఉండాలి.
3. మీ బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి.
4. మీ భూ రికార్డులలో ఏమైనా సమస్యలు ఉంటే, వాటిని సరిచేసుకోవాలి.
5. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి మీ బెనిఫిషియరీ స్టేటస్‌ను తప్పకుండా చెక్ చేసుకోవాలి.
6. మీ మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే పథకానికి సంబంధించిన సమాచారం మీకు వస్తుంది.
పీఎం కిసాన్ పథకం వెబ్సైట్ చిరునామా: pmkisan.gov.in/ ఈ వెబ్సైట్లోకి వెళ్లి, హోమ్ పేజీలో కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే కనిపించే ఫార్మర్స్ కార్నర్ సెక్షన్లో బెనిఫిషియరీ లిస్ట్ ను క్లిక్ చేసి, మీ గ్రామంలోని పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల పూర్తి జాబితాను చూడవచ్చు. ఇ-కేవైసి చేసే అవకాశం, మొబైల్ నంబర్ అప్డేట్ చేసే అవకాశం కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
Read Also:Joe Root : లార్డ్స్‌లో రాహుల్ ద్రావిడ్‌ను దాటేసిన జో రూట్.. సెంచరీతో సరికొత్త రికార్డు
పీఎం కిసాన్ యోజన అనేది రైతుల వ్యవసాయ అవసరాలకు ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న పథకం. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.6,000 నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తారు. ఈ మొత్తాన్ని ఏడాదికి మూడు విడతలలో, అంటే, ఒక్కో విడతకు రూ.2,000 చొప్పున అందిస్తారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ డబ్బు రైతుల ఖాతాలకు నేరుగా క్రెడిట్ అవుతుంది. ఇప్పటివరకు 9 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకంలో నమోదు చేసుకుని లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 19 విడతల డబ్బులను విడుదల చేసింది.