Bajaj Auto : బజాజ్ ఆటో చరిత్రలో కొత్త మలుపు.. 7,765 కోట్ల డీల్..కేటీఎం చేజిక్కించుకోనున్న భారతీయ దిగ్గజం

Bajaj Auto : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ కేటీఎం (KTM)లో తన అనుబంధ సంస్థ బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ బీవీ (BAIHBV) ద్వారా మెజారిటీ వాటాను కొనుగోలు చేయబోతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ చర్య బజాజ్ ఆటో పాత్రలో ఒక గణనీయమైన మార్పును సూచిస్తుంది. కేవలం భాగస్వామ్యంతో కాకుండా ఇప్పుడు కేటీఎం బ్రాండ్‌పైనే బజాజ్ ప్రత్యక్షంగా పట్టు సాధించనుంది.
ప్రీమియం మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో పట్టు
బజాజ్ ఆటో ఈ భారీ పెట్టుబడితో ప్రీమియం, స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో నేరుగా అడుగుపెట్టనుంది. కేవలం పెట్టుబడితోనే కాకుండా కేటీఎం బ్రాండ్‌ను పునర్నిర్మించడంతో పాటు, మోటార్‌సైకిల్ మార్కెట్లో బజాజ్ కంపెనీని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు ఈ కొనుగోలు సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.
Read Also:ITR: ఐటీఆర్ ఫైలింగ్.. జరిమానా లేకుండా ఎప్పటి లోగా రిటర్న్ దాఖలు చేయవచ్చంటే?
రూ. 7,765 కోట్ల భారీ డీల్
BAIHBV మొత్తం 800 మిలియన్ యూరోలు (సుమారు రూ.7,765 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి ప్రణాళిక వేసింది. ఈ నిధుల లక్ష్యం కేటీఎం ఆర్థిక స్థితిని స్థిరపరచడం. మొత్తం మొత్తంలో ఇప్పటికే 200 మిలియన్ యూరోలు పెట్టుబడి పెట్టబడ్డాయని, మిగిలిన 600 మిలియన్ యూరోలు ఇప్పుడు చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. కేటీఎం, దాని అనుబంధ సంస్థలు దివాలా చర్యల నుంచి బయటపడటానికి 2025 మే 23 గడువుకు ముందు 30 శాతం రుణదాతల క్లెయిమ్‌లను పరిష్కరించాలని కోర్టు ఆదేశించింది. బజాజ్ ఈ కొనుగోలుతో ఆ ఆర్థిక సవాళ్లను అధిగమించడంలో కేటీఎమ్‌కు మద్దతు ఇవ్వనుంది.
పీబీఏజీలో నియంత్రణ వాటాకు బజాజ్ ప్లాన్
బజాజ్ ఆటో పీబీఏజీ (PBAG)లో నియంత్రణ వాటాను కూడా పొందేందుకు ప్రణాళిక వేస్తోంది. పీబీఏజీ అనేది పీయర్ మోబిలిటీ AGకి మాతృ సంస్థ, ఇది కేటీఎం AGకి యజమాని. ప్రస్తుతం, బజాజ్ ఆటో పీబీఏజీ మరియు పీయర్ మోబిలిటీ ద్వారా కేటీఎమ్‌లో పరోక్షంగా 37.5 శాతం వాటాను కలిగి ఉంది. సెబీ నిబంధనలకు అనుగుణంగా బజాజ్ ఆటో బోర్డు వాటాదారులకు ఈ డీల్ వివరాలను తెలియజేసింది. ఈ కొనుగోలు బజాజ్ ఆటోకు అంతర్జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. దీనితో కేటీఎం వ్యాపారానికి మళ్ళీ కొత్త ఊపు లభిస్తుందని ఆశిస్తున్నారు. రెండు కంపెనీలు ఇప్పటికే భారతదేశంలో ఉన్న ఒక జాయింట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కలిసి పని చేస్తున్నాయి.
Read Also:Uttar Pradesh: నిజాయితీకి మారు పేరు అంటే ఇతనే!
యూత్‌కు కేటీఎం బైక్స్ ఎందుకు ఇష్టం?
స్పోర్టీ డిజైన్, అద్భుతమైన పనితీరు, సరసమైన ధరల కారణంగా భారతదేశంలో కేటీఎం బైక్‌లు చాలా పాపులారిటీ పొందాయి. ముఖ్యంగా యువత వీటిని బాగా ఇష్టపడతారు. కేటీఎం ఒక ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ అయినప్పటికీ, భారతదేశంలో దీని తయారీ, డిస్ట్రిబ్యూషన్ బజాజ్ ఆటోతో భాగస్వామ్యంలో జరుగుతుంది. ఈ కొత్త కొనుగోలుతో కేటీఎం భారత మార్కెట్లో మరింత బలంగా నిలబడటమే కాకుండా, ప్రపంచ స్థాయిలో బజాజ్ బ్రాండ్‌కు కొత్త గుర్తింపు తెస్తుంది.