Oben Electric : స్ప్లెండర్, ప్లాటినా గట్టి షాక్.. లక్షలోపే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్

Oben Electric : బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ భారతదేశంలో త్వరలో ఒక అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కొత్తగా రూపొందించిన ‘O100’ ప్లాట్‌ఫామ్‌తో మార్కెట్లోకి రానున్న ఈ కొత్త సిరీస్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు, ఎంట్రీ-లెవల్ 100 సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లకు (స్ప్లెండర్, ప్లాటినా వంటివి) గట్టి పోటీని ఇస్తూ రూ.లక్ష లోపే అందుబాటులోకి రానున్నాయి. ARX తర్వాత ఓబెన్ తయారుచేసిన రెండో స్వదేశీ ప్లాట్‌ఫామ్ ఇదే.
ఓబెన్ O100 ప్లాట్‌ఫామ్‌ను బెంగళూరులోని ఓబెన్ పరిశోధన, అభివృద్ధి (R&D) కేంద్రంలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ మాడ్యులర్‌గా ఉంటుంది. దీని ఆధారంగా డిఫరెంట్ వేరియంట్స్, బ్యాటరీ ఆప్షన్లతో బైక్‌లను తయారు చేయవచ్చు. వివిధ రకాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించే అవకాశం ఉంది. ఈ ప్లాట్‌ఫామ్ భవిష్యత్తుకు రెడీగా ఉందని, కొత్త టెక్నాలజీలు, మౌలిక సదుపాయాల అప్ డేట్లను ఈజీగా సులభంగా కనెక్ట్ చేస్తామని కంపెనీ పేర్కొంది.బడ్జెట్ ధరల్లో ఎలక్ట్రిక్ బైక్‌ల సిరీస్ లను మార్కెట్లోకి తీసుకురావడంలో ఓబెన్ ఈ నిర్ణయం కీలక పాత్ర పోషిస్తుంది.
Read Also:Kia Carens Clavis : ఇన్నోవాకు కష్టకాలం మొదలు.. రూ.11.49లక్షలకే 7సీటర్ కారు
ప్రస్తుతం ఓబెన్ ఎలక్ట్రిక్, Rorr, Rorr EZ అనే రెండు ఎలక్ట్రిక్ బైక్‌లను విక్రయిస్తోంది. ఈ రెండు మోడల్స్ ARK ప్లాట్‌ఫామ్‌పైనే ఆధారపడి ఉన్నాయి. కొన్ని మార్పులతో ఒకే ప్లాట్‌ఫామ్‌ను షేర్ చేసుకుంటున్నాయి. Rorr కంపెనీ ప్రధాన ఎలక్ట్రిక్ బైక్ కాగా రాబోయే O100 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడే కొత్త కమ్యూటర్ ఈ-బైక్‌లు మరింత సరసమైనవిగా ఉండనున్నాయి. ఇవి ఈ సంవత్సరం రెండో భాగంలో మార్కెట్లోకి రానున్నాయి. రాబోయే వారాల్లో ఈ కొత్త మోడల్స్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఓబెన్ భారతదేశం అంతటా టైర్ I, II, III నగరాల్లో తమ ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి 100 కంటే ఎక్కువ అవుట్లెట్లను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ప్లాట్‌ఫామ్‌తో విడుదల కానున్న సరసమైన ఎలక్ట్రిక్ బైక్‌లు కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచడానికి సహాయపడతాయి.
Read Also:Summer Skincare : వేసవిలో నల్లగా మారిన చేతులు మిలమిలా మెరవాలా.. ఈ 5 చిట్కాలు పాటించండి
భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అనేక దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. పర్యావరణ స్పృహ, పెట్రోల్ ధరల పెరుగుదల కారణంగా ఎలక్ట్రిక్ బైక్‌లకు ఆదరణ పెరుగుతోంది. ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీదారులలో Revolt Motors, Tork Motors, Ultraviolette Automotive, Oben Electric, Matter వంటివి ఉన్నాయి.
Oben Rorr, Matter Aera వంటి బైక్‌లు రూ.1.50 లక్షల నుండి రూ.1.70 లక్షల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. Revolt RV400 ధర దాదాపు రూ.1.40 లక్షలు. ఇది 150 కి.మీ.ల వరకు రేంజ్ ఇస్తుంది.Tork Kratos R ధర రూ.1.67 లక్షల వరకు ఉంటుంది. ఇది 180 కి.మీ.ల రేంజ్, 105 కి.మీ./గంట గరిష్ట వేగాన్ని అందిస్తుంది. Ultraviolette F77, ఒక ప్రీమియం పర్ఫార్మెన్స్ బైక్, దీని ధర రూ.3.80 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 300 కి.మీ.ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఓబెన్ విడుదల చేయనున్న రూ.లక్షలోపు ఎలక్ట్రిక్ బైక్ భారతదేశంలోని సామాన్య ప్రజలకు ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తీసుకురాగలదని భావిస్తున్నారు.