Plane Crash : నిజంగా ఇది అద్భుతం.. విమానం కుప్పకూలినా బతికి బయటపడ్డ 155మంది

Plane Crash : ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 272 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు విమానాల్లో ప్రయాణం చేయాలంటే భయం వేస్తుంది కదా? కానీ, కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరిగినా, కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అలాంటి ఒక అద్భుతమే 2009లో న్యూయార్క్ నగరంలో జరిగింది. ఒక విమానం గాల్లో ఉండగానే పక్షుల గుంపును ఢీకొట్టింది. రెండు ఇంజిన్‌లు పనిచేయకపోయినా, పైలట్ చాకచక్యంగా నదిలో విమానాన్ని దించి, అందరి ప్రాణాలు కాపాడాడు.
2009లో న్యూయార్క్ నగరంలో ఒక విమానం టేకాఫ్ అయింది. గాల్లోకి లేవగానే ఒక పెద్ద పక్షుల గుంపు ఆ విమానాన్ని ఢీకొట్టింది. దానితో విమానంలో ఉన్న రెండు ఇంజిన్‌లు ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోయాయి. పరిస్థితి చేయి దాటిపోతుందని అర్థం చేసుకున్న పైలట్ కెప్టెన్ సలెన్‌బర్గర్, వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి కాల్ చేసి, విమానాశ్రయానికి తిరిగి వస్తున్నట్లు చెప్పారు.
Read Also:Diamond Formation : వజ్రాలు ఎలా ఏర్పడతాయి ? భూమి లోపల జరిగే వింత ప్రక్రియ ఇదే
కానీ, అది సాధ్యం కాదని అర్థం అవ్వడంతో, కేవలం మూడున్నర నిమిషాల్లోనే ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. న్యూయార్క్ నగరంలోని హడ్సన్ నదిలో విమానాన్ని అత్యవసరంగా దించేశారు. ఈ సంఘటనను మిరాకిల్ ఆన్ ది హడ్సన్ అని పిలుస్తారు. విమానం నదిలో దిగగానే, వెంటనే నీళ్ళు లోపలికి వచ్చాయి. అయితే, ప్రయాణికులు భయపడకుండా, విమానంలోని ఎమర్జెన్సీ డోర్ల ద్వారా విమానం రెక్కల పైకి వచ్చేశారు. ఆ సమయంలో బయట ఉష్ణోగ్రత మైనస్ 7 డిగ్రీలు ఉంది. ఎంత చలిగా ఉందంటే, ఎవరైనా ఎక్కువసేపు నీటిలో ఉంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంది.
అయితే, అదృష్టవశాత్తూ కేవలం కొన్ని నిమిషాల్లోనే పెర్రీ బోట్లు, ఇతర నౌకలు అక్కడికి చేరుకున్నాయి. చాలా వేగంగా సహాయక చర్యలు మొదలుపెట్టాయి. విమానం నదిలో పూర్తిగా మునిగిపోకుండా ఉండటానికి టగ్ బోట్లను అడ్డుపెట్టారు. ఈ ప్రమాదంలో ఒక పెద్ద అదృష్టం ఏమిటంటే, ఆ విమానంలో ఉన్న 150 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది… మొత్తం 155 మంది చిన్నపాటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. చాకచక్యంగా, ఎలాంటి ప్రాణనష్టం లేకుండా విమానాన్ని నదిలో దించిన పైలట్ కెప్టెన్ సలెన్‌బర్గర్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. ఆయన చేసిన పనికి హీరోగా గుర్తింపు దక్కించుకున్నారు.
Read Also:Cockroach : బొద్దింక తల తెగినా బతుకుతుందా .. 2నెలలు తిండి లేకుండా ఉంటుందట.. నిజమేనా ?
ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత, ఆ విమానాన్ని నదిలో నుంచి బయటికి తీసి, కరోలినాస్ ఏవియేషన్ మ్యూజియంలో భద్రపరిచారు. ఈ సంఘటన విమానయాన చరిత్రలో ఒక గొప్ప పాఠాన్ని, అలాగే ఒక అద్భుతాన్ని మిగిల్చింది. ప్రమాదాలు జరిగినా సరైన నిర్ణయాలతో, ధైర్యంతో ప్రాణాలను ఎలా కాపాడొచ్చో ఇది నిరూపించింది.