Viral : తప్పతాగి స్పూన్ మింగేశాడు.. తెలియకుండానే ఆర్నెళ్లు గడిపిన ఘనుడు

Viral : ఒక్కోసారి తాగిన మైకంలో మనుషులు ఏం చేస్తారో వారికే తెలియదు.. మత్తు దిగితే కానీ అర్థం కాదు అప్పుడు ఎంత పెద్ద తప్పు చేశామో అని.. ఇది అలాంటిదే. ఒక చైనా మనిషి తాగి ఏకంగా ఒక స్పూన్‌ను మింగేశాడు. అంతేనా, అది నిజం కాదని.. కేవలం ఒక కల అని 6 నెలలు అదే మైకంలో ఉన్నాడు. తీరా డాక్టర్ల దగ్గరికి వెళ్తే గానీ అసలు విషయం తెలిసి షాక్ అయ్యాడు. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది. 29 ఏళ్ల యాంగ్ అనే ఒక చైనా వ్యక్తి జనవరి నెలలో థాయ్‌లాండ్‌లో బాగా తాగి ఉన్నాడు. మైకంలో ఉండగా తనకు వాంతులు కావాలనిపించి, హోటల్ గదిలో ఉన్న ఒక సిరామిక్ కాఫీ స్పూన్‌ను గొంతులో పెట్టడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఊహించని విధంగా ఆ స్పూన్ చేతిలోంచి జారి, ఏకంగా కడుపులోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత అతను పూర్తిగా స్పృహ కోల్పోయాడు.
మరుసటి రోజు ఉదయం స్పృహలోకి రాగానే.. అబ్బా, స్పూన్ మింగినట్లు కల వచ్చిందేంటి? అని అనుకుని, ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయాడు. షాంగైకి తిరిగి వచ్చాక, ఆరు నెలల పాటు రోజువారీ పనులు, వ్యాయామాలు కూడా మామూలుగానే చేసుకున్నాడు. కడుపులో స్పూన్ ఉందని అతనికి అస్సలు తెలియదు, పెద్దగా ఇబ్బంది కూడా అనిపించలేదు. కొన్నాళ్ళ తర్వాత, యాంగ్‌కు కడుపులో ఏదో అసౌకర్యంగా అనిపించింది. ఏమైనా ప్లాస్టిక్ మింగానేమో అనుమానించి, షాంగైలోని జోంగ్షాన్ హాస్పిటల్‌కు వెళ్లాడు. డాక్టర్లు టెస్టులు చేస్తుండగా తన కడుపులో ఒక 15 సెంటీమీటర్ల కాఫీ స్పూన్ ఇరుక్కుని ఉండటం చూసి అవాక్కయ్యారు. డాక్టర్లు ఆ విషయం చెప్పగానే, యాంగ్‌కు థాయ్‌లాండ్‌లో జరిగిన సంఘటన గుర్తుకొచ్చి, అది కల కాదని నిజంగానే జరిగిందని తెలిసి షాక్ అయ్యాడు.
Read Also:Banks: ఈ బ్యాంకులకు ఇకపై మినిమం బ్యాలెన్స్ ఉండక్కర్లేదు.. ఆ బ్యాంకులు ఏవంటే?
జున్ 18న యాంగ్‌కు ఎండోస్కోపిక్ సర్జరీ చేశారు. ఆ స్పూన్ జారుడు స్వభావం వల్ల మొదటి ప్రయత్నం విఫలమైంది. తర్వాత వ్యూహం మార్చి, డాక్టర్లు ఆ స్పూన్‌ను సక్సెస్ ఫుల్ గా బయటికి తీశారు. సర్జరీ తర్వాత యాంగ్‌ను డిశ్చార్జ్ చేశారు. ఇలాంటి విచిత్రమైన కేసులే ఈ మధ్య చైనాలో కొన్ని వెలుగు చూశాయి. ఈ నెల మొదట్లోనే యాంగ్ అనే 64 ఏళ్ల మరో వ్యక్తిలో 17 సెంటీమీటర్ల టూత్‌బ్రష్‌ను డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటికి తీశారు. అయితే ఈ బ్రష్ అతని కడుపులో ఏకంగా 52 ఏళ్ల నుంచి ఉందని తెలిసింది. ఆ వ్యక్తికి 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు టూత్‌బ్రష్ మింగేసినట్లు గుర్తుందట. కానీ తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి మామూలుగానే ఉండిపోయాడట. టూత్‌బ్రష్ దానంతటదే కరిగిపోతుందని అతను నమ్మాడు.
ఏళ్ల తరబడి నొప్పి లేకుండానే ఉన్నా తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. వాస్తవానికి పేగుల్లో టూత్‌బ్రష్ ఉంటే అది కదిలి లోపలి కణజాలాన్ని చిల్లులు పెట్టే ప్రమాదం ఉంటుంది..కానీ యాంగ్ విషయంలో అదృష్టవశాత్తూ టూత్‌బ్రష్ పేగులోని ఒక మూలన ఇరుక్కుని కొన్నేళ్లు పాటు అలా కదలకుండా ఉండిపోయింది.