Viral : రూ.2కోట్ల ఖర్చు, ఉద్యోగం వదిలేసి.. కోమాలోకి వెళ్లిన భార్యకు ప్రాణం పోసిన భర్త

Viral : మనకు అత్యంత సన్నిహితులు బాధలో ఉన్నప్పుడు వారి నొప్పిని తగ్గించడానికి ఎలాంటి పని చేసేందుకు అయినా వెనుకాడం. వారు వద్దని చెప్పినా సరే వారికి సాయం చేస్తాం. చైనాలో సరిగ్గా అలాంటి ఒక సంఘటన జరిగింది. అక్కడ ఒక వ్యక్తి భార్య క్యాన్సర్‌తో పోరాడుతూ కోమాలోకి వెళ్లిపోయింది. తన చికిత్స కోసం డబ్బులు వృథా చేయవద్దని, అది తన చిన్న కుటుంబానికి ఆర్థిక భారాన్ని పెంచుతుందని ఆమె భర్తకు చెప్పింది. డాక్టర్లు కూడా ఆశ వదులుకున్నారు. కానీ ఆ భర్త మాత్రం అస్సలు తగ్గలేదు. తన భార్యను కాపాడుకోవడానికి ఏకంగా 2,80,000 డాలర్లు (రూ.2 కోట్లకు పైగా) ఖర్చు చేశాడు. ఈ క్రమంలో తన ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనాలోని గువాంగ్జీకి చెందిన 30 ఏళ్ల డెంగ్ యూకాయ్ (Deng Youcai) అనే వ్యక్తి 2016లో ఒక స్నేహితుడి పెళ్లిలో యే మెయిడి (Ye Meidi)ని చూసి మొదటి చూపులోనే ప్రేమించాడు. డెంగ్‌కు చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అందుకే అతను చిన్న వయస్సులోనే పాఠశాల మానేసి, ఒక పెద్ద నగరంలో వలస కూలీగా పని చేశాడు. ఇక యే విషయానికొస్తే.. ఆమెకు గ్లియోమా (Glioma) అనే బ్రెయిన్ ట్యూమర్ రావడంతో యూనివర్సిటీ చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. గ్లియోమా అనేది 90 శాతం కంటే ఎక్కువ మళ్లీ వచ్చే అవకాశం ఉన్న ట్యూమర్. అయినా సరే, డెంగ్ యే వ్యక్తిత్వాన్ని ఎంతగానో ఇష్టపడ్డాడు. ఆమె అనారోగ్యంతో ఉందని తెలిసినా, ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేశాడు. మొదట యే ఆ ప్రపోజల్‌ను తిరస్కరించింది. కానీ డెంగ్ ఆమె అనారోగ్యంతో పోరాటంలో ఆమెకు తోడుగా ఉంటానని గట్టిగా చెప్పడంతో యే అంగీకరించింది.
Read Also:Viral Video: ప్రేయసి కోసం ఏకంగా.. స్పెయిన్ ప్రిన్సెన్‌ను రిజక్ట్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్
2019లో డెంగ్, యే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పుడు డెంగ్, యేతో తాను ఎప్పుడూ ఆమెతో ఉంటానని, తన మాటను ఎప్పటికీ వెనక్కి తీసుకోనని చెప్పాడు. 2021లో వారికి హన్హాన్ అనే అందమైన పాప పుట్టింది. కానీ ఒక సంవత్సరం తర్వాత యేకు మళ్లీ గ్లియోమా తిరగబెట్టింది. కోమాలోకి వెళ్లడానికి ముందు తన చికిత్స కోసం చాలా డబ్బు వృథా అవుతుందని, తనను చనిపోవడానికి వదిలేయమని డెంగ్‌తో చెప్పింది.కానీ డెంగ్ వినలేదు. రెండు సర్జరీలు చేసినప్పటికీ యేకు స్పృహ రాలేదు. దీంతో డాక్టర్లు కూడా ఆశ వదులుకున్నారు. డాక్టర్ల సలహా మేరకు డెంగ్ తన భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. కుటుంబ సభ్యులు కూడా వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. అప్పుడే వారి కుమార్తె హన్హాన్ యే చెంపపై ముద్దు పెట్టుకుంది. డెంగ్ ఆ క్షణాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
డెంగ్ పోస్ట్ చేసిన ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు అతనికి ధైర్యం చెప్పడమే కాకుండా, డబ్బును కూడా విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత డెంగ్ యేను తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మూడు నెలల తర్వాత యే కోమా నుంచి బయటకు వచ్చింది. రెండు నెలల తర్వాత మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టింది. స్పృహలోకి రాగానే యే డెంగ్‌కు ముందుగా ధన్యవాదాలు చెప్పింది. డెంగ్ తన భార్య యే, కూతురు హన్హాన్ బాగోగులు చూసుకోవడం కోసం తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. ప్రతిరోజూ కోమాలో ఉన్న తన భార్యను సంతోషపెట్టడానికి ఆమెతో పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఉండేవాడు. అతని ప్రేమ, అంకితభావమే యేను తిరిగి మామూలు మనిషిని చేసిందని చెప్పాలి. ఇప్పుడు యే స్వయంగా నడుస్తుంది. ఒక దుకాణాన్ని కూడా నడుపుతోంది. ఈ జంటకు సోషల్ మీడియా ఖాతాలలో దాదాపు 20 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. వారు లైవ్-స్ట్రీమింగ్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నారు.
Read Also:Liver Infections: లివర్‌కు ఎన్ని రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి? అవి ఎలా మొదలవుతాయి?