Blood Test : రక్తం తీయకుండానే బ్లడ్ టెస్ట్.. 20 సెకన్లలో ఫేస్ స్కాన్‌తో రిపోర్టులు రెడీ

Blood Test : ఈ రోజుల్లో బిజీ లైఫ్‌లో హెల్త్ చెకప్‌ల కోసం సమయం కేటాయించడం చాలా మందికి కష్టం. ముఖ్యంగా బ్లడ్ టెస్ట్ అంటే సూదితో రక్తం తీయించుకోవడానికి చాలా మంది భయపడుతుంటారు. చాలా మంది దీన్ని నివారించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సూది, బ్లేడ్ అవసరం లేకుండానే బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. కేవలం ఫేస్ స్కాన్ ద్వారా బ్లడ్ టెస్ట్ సాధ్యమవుతుంది.అంతేకాదు, ఫేస్ స్కాన్ ద్వారా మీ శరీరంలోని అనేక ముఖ్యమైన సమాచారాన్ని కూడా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇదంతా AI వల్లనే సాధ్యమైంది. ఆరోగ్య పర్యవేక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. కేవలం ఫేస్ స్కాన్ ద్వారా 20 సెకన్లలో మీ ఆరోగ్య స్థితి మీ కళ్ళ ముందు ఉంటుంది.
ఒక కెమెరాతో పూర్తి హెల్త్ చెకప్
క్విక్ వైటల్ (Quick Vital) అనే AI ఆధారిత యాప్ ఇప్పుడు ఆరోగ్య పర్యవేక్షణ పద్ధతి(Health monitoring method)ని మార్చబోతోంది. ఈ యాప్‌ను 2024లో ప్రారంభించారు. దీనిని మొదట హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి నిలోఫర్ లో ఉపయోగించారు. అక్కడ గర్భిణీ స్త్రీలలో ఐరన్ లోపం (అనీమియా)ను గుర్తించడానికి దీనిని ఉపయోగించారు. దీనిలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి.
ఈ టూల్ ఉపయోగించే టెక్నాలజీ పేరు ఫోటోప్లెథిస్మోగ్రఫీ (Photoplethysmography – PPG). మంచి వెలుతురులో మీరు మీ ముఖాన్ని స్కాన్ చేసినప్పుడు ఫోన్ కెమెరా ద్వారా ప్రతిబింబించే కాంతిని ఈ యాప్ గ్రహిస్తుంది. ఆపై అల్గారిథమ్‌ల సహాయంతో గుండె కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడం, రక్త ప్రవాహానికి సంబంధించిన సంకేతాలను విశ్లేషించి హెల్త్ రిపోర్ట్ రెడీ చేస్తుంది.
Read Also : Android 16 : పూర్తిగా మారిపోయిన స్మార్ట్‌ఫోన్ లుక్..ఆండ్రాయిడ్ 16 బీటా వచ్చేసింది!
కేవలం 20 సెకన్లలో మీ శరీరంలోని అనేక ముఖ్యమైన అవయవాల సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. ఈ యాప్ అందించే సమాచారం ఏమిటో తెలుసుకుందాం. బ్లడ్ ప్రెషర్ (రక్తపోటు), హిమోగ్లోబిన్ స్థాయి, హార్ట్ రేట్ (గుండె కొట్టుకునే వేగం), ఆక్సిజన్ శాచురేషన్ (SpO2), శ్వాస రేటు, ఒత్తిడి స్థాయి, కొలెస్ట్రాల్, హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV), సింపథెటిక్, పారాసింపథెటిక్ యాక్టివిటీకి సంబంధించిన సమాచారం కూడా ఇది అందిస్తుంది.
గ్రామీణ ప్రాంతాలకు వరం
భారత్ లాంటి దేశంలో చాలా ప్రాంతాల్లో బ్లడ్ టెస్ట్ సౌకర్యాలు లేదా ల్యాబ్‌లు అందుబాటులో లేవు. అలాంటి చోట్ల ఈ టెక్నాలజీ ఒక వరంగా మారవచ్చు. డెవలపర్లు ఇప్పుడు మహారాష్ట్ర తర్వాత గిరిజన ప్రాంతాల్లో దీన్ని అమలు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, RBSK, RKSK వంటి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలతో అనుసంధానించవచ్చు.
Read Also :Airtel vs. Jio: ఎయిర్టెల్ కొత్త ప్లాన్‌తో జియోకు షాక్.. మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఒకేసారి!
భారతదేశంలో ప్రతి 10 మంది మహిళల్లో నలుగురు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రక్తం తీయకుండానే, చవక, వేగవంతమైన పద్ధతిలో పరీక్షలు చేస్తే, సకాలంలో చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ఈ టూల్ ఆరోగ్య సంరక్షణ రంగంలో, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లల కోసం ఒక విప్లవాన్ని తీసుకురాగలదని వైద్యులు భావిస్తున్నారు.
త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరణ
ఈ యాప్‌ను ఇప్పుడు మహారాష్ట్రలో విస్తరిస్తున్నారు. త్వరలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 1,000 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. వీటిలో ఈ యాప్ ఫలితాలను సంప్రదాయ బ్లడ్ టెస్ట్ ఫలితాలతో పోలుస్తారు. అంతా సక్రమంగా జరిగితే ఈ టెక్నాలజీ దేశవ్యాప్తంగా ఆరోగ్య పరీక్షలకు అత్యంత సులభమైన పద్ధతిగా మారవచ్చు.