Traffic Police : ట్రాఫిక్ పోలీసులు బండిని లాక్కెళ్లారా ? ఎక్కడికి తీసుకెళ్లారో, ఎలా విడిపించుకోవాలో తెలుసా ?

Traffic Police : ఒక్కోసారి మనం ఏదో పని మీద బయటికి వెళ్తాం. బండి ఎక్కడో ఒకచోట పార్క్ చేసి వెళ్తాం. పని ముగించుకొని తిరిగి వచ్చి చూస్తే… బండి కనిపించదు. అప్పుడు గుండె గుభేల్ మంటుంది. ట్రాఫిక్ పోలీసులు లాక్కెళ్లారా ఏంటన్న డౌట్ వస్తుంది. మరి నిజంగానే వాళ్ళు తీసుకెళ్తే, ఎక్కడికి తీసుకెళ్తారు? ఎలా తెలుసుకోవాలి? మళ్ళీ మన బండిని ఎలా తెచ్చుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు చాలామంది మదిలోకి వస్తూ ఉంటాయి.
అసలు ట్రాఫిక్ పోలీసులు మీ బండిని ఎందుకు లాక్కెళ్తారో ముందు తెలుసుకోవాలి. దీనికి కారణం కారు లేదా బైక్ నో-పార్కింగ్ జోన్లో పార్క్ చేసి ఉంచడమే. లేదా ఫుట్‌పాత్ లేదా జీబ్రా క్రాసింగ్‌పై బండిని ఆపడం, ట్రాఫిక్‌కు అడ్డంగా బండిని నిలబెట్టడం, నెంబర్ ప్లేట్ లేని లేదా తప్పు నెంబర్ ప్లేట్ ఉన్న బండ్లు, ఇన్సూరెన్స్ గడువు ముగిసిన లేదా సరైన డాక్యుమెంట్లు లేని వాహనాలను తీసుకెళ్తారు. అయితే, చాలావరకు బండిని లాక్కెళ్లేది మాత్రం నో పార్కింగ్‌లో నిలబెట్టినందుకే!
Read Also:Kerala : 4వ తరగతిలో కొట్టినందుకు 50ఏళ్ల తర్వాత రివెంజ్.. ఫ్రెండ్స్ రీయూనియన్‌లో పాత పగ
ట్రాఫిక్ పోలీసులు మీ బండిని టో చేసినప్పుడు, దాన్ని ప్రభుత్వానికి చెందిన అధికారిక టో యార్డ్‌కు (Tow Yard) లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు. ప్రతీ నగరంలో వేర్వేరు చోట్ల ఈ యార్డులు ఉంటాయి. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు టో చేసిన వాహనాలను ప్రధానంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలోని నిర్దేశిత యార్డులకు లేదా కొన్ని ప్రాంతాల్లో ఉండే సెంట్రల్ టోయింగ్ యార్డులకు తీసుకెళ్తారు. ఉదాహరణకు, సికింద్రాబాద్, బంజారాహిల్స్, కూకట్పల్లి, సైబరాబాద్ పరిధిలో వేర్వేరు టోయింగ్ పాయింట్లు ఉంటాయి. మీ బండి ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడానికి కొన్ని సింపుల్ మార్గాలు ఉన్నాయి.
SMS లేదా ఆన్లైన్ పోర్టల్:
చాలా నగరాల ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్లలో ‘చలాన్ స్టేటస్’ లేదా ‘టౌడ్ వెహికల్ ఇన్ఫర్మేషన్’ అనే ఆప్షన్లు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ echallan.parivahan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి. లేదా, ఆయా రాష్ట్రాలకు చెందిన ట్రాఫిక్ వెబ్‌సైట్‌కు వెళ్ళండి. మీ బండి నెంబర్ ఎంటర్ చేయండి. మీ చలాన్ వివరాలు లేదా టో చేసిన సమాచారం కనిపిస్తుంది.
Read Also:RBI : ఆర్బీఐ కొత్త రూల్.. పదేళ్లు దాటిన పిల్లలకు గుడ్ న్యూస్
హెల్ప్‌లైన్ నంబర్లు:
ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి అడగొచ్చు. హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్: 040-27852482 లేదా ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్ 9490616001కి కాల్ చేసి మీ వాహనం నంబర్ చెప్పి ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసుకోవచ్చు.
టో చేసిన బండిని ఎలా విడిపించుకోవాలి?
టో చేసిన మీ బండిని విడిపించుకోవాలంటే, మీరు కొన్ని డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాలి. మీ బండికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు పట్టుకెళ్లాలి. అవి RC (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్), డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పేపర్లు, పొల్యూషన్ సర్టిఫికేట్ (PUC) మీ వెంట తీసుకెళ్లి చూపించాలి. చలాన్ డబ్బును ఆన్లైన్లో గానీ, లేదా అక్కడికక్కడే గానీ చెల్లించాల్సి రావచ్చు. డబ్బు కట్టాక, తప్పకుండా రసీదు తీసుకోవాలి. ఆ రసీదు చూపిస్తేనే మీకు బండి ఇస్తారు. ఒకవేళ మీ బండిని తప్పుగా టో చేశారని లేదా తప్పు చలాన్ వేశారని మీకు అనిపిస్తే, మీరు దాన్ని అప్పీల్ చేయొచ్చు. దీనికోసం ట్రాఫిక్ పోలీస్ అథారిటీని సంప్రదించాలి.