COPD : విపరీతమైన దగ్గు, ఆయాసం వస్తుందా.. ఇది సాధారణమా లేదా ప్రమాదకరమా ?

COPD : కొంతమందిలో విపరీతమైన దగ్గు, దానితో పాటు ఆయాసం తరచుగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ధూమపానం చేసేవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలనే వైద్యులు సీఓపీడీ (COPD – క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) అని పేర్కొంటారు. దగ్గు, ఆయాసం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. వ్యాధి తీవ్రతను బట్టి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. 2015లో ప్రపంచవ్యాప్తంగా 3.25 మిలియన్ల మంది ఈ వ్యాధి కారణంగా మరణించారు. మన దేశంలో ఏటా 2,200 మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. ఈ వ్యాధి నుండి ఎలా బయటపడాలో వివరంగా తెలుసుకుందాం.
సీఓపీడీ అంటే ఏమిటి?
సీఓపీడీ అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఒక రకమైన తీవ్రమైన, దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి సోకినవారిలో శ్వాసనాళాలు ఇన్ఫెక్షన్కు గురై కొన్నిసార్లు మూసుకుపోతాయి లేదా ఇరుకుగా మారతాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఊపిరితిత్తుల లోపల ఉండే చిన్న గాలి సంచులు దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఈ ఆల్వియోలై దెబ్బతినడం వల్ల ఊపిరితిత్తులు గాలిని సమర్థవంతంగా బయటికి పంపలేవు, దీంతో శ్వాస తీసుకోడానికి మరింత కష్టమవుతుంది. దీర్ఘకాలికంగా శ్వాసనాళాల్లో మంట, అడ్డుపడటం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
సీఓపీడీలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి:
ఎమ్ఫిసెమా : ఇందులో ఊపిరితిత్తులలోని గాలి సంచులు దెబ్బతింటాయి. దీంతో అవి గాలిని నిలబెట్టుకోలేక, బయటికి పంపలేక శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
క్రానిక్ బ్రోన్కైటిస్ : ఇందులో శ్వాసనాళాల లోపల పొరలు వాచి, శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో శ్వాసనాళాలు ఇరుకుగా మారి దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి. ఈ రెండు పరిస్థితులు తరచుగా కలిసే కనిపిస్తాయి. అందుకే వీటిని సీఓపీడీ అని వ్యవహరిస్తారు.
Read Also:Lychee Momos : లిచీ పండ్లతో మోమోస్ తయారీ.. తిన్నోడి పరిస్థితి ఎలా ఉందో మరి ?
సీఓపీడీకి కారణాలు
సీఓపీడీకి ప్రధానంగా అనేక కారణాలు ఉన్నాయి. సిగరెట్లు, బీడీలు లేదా ఇతర పొగాకు ఉత్పత్తులను సేవించడం సీఓపీడీకి అతి పెద్ద కారణం. పరోక్ష ధూమపానం కూడా ప్రమాదకరమే. పొగాకు పొగలోని రసాయనాలు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. వాహనాల నుండి వెలువడే పొగ, పారిశ్రామిక కాలుష్యం, ఇళ్ళలో వంటచెరకు లేదా బొగ్గు వంటివి కాల్చడం వల్ల వచ్చే పొగ సీఓపీడీకి దారితీయవచ్చు. కొన్ని పరిశ్రమలలో పనిచేసేవారు దుమ్ము, రసాయనాలు, పొగ వంటి వాటికి నిరంతరం గురికావడం వల్ల సీఓపీడీ వచ్చే అవకాశం ఉంది.
సీఓపీడీ వ్యాధిగ్రస్తులలో కనిపించే ప్రధాన లక్షణాలు సాధారణంగా నెమ్మదిగా ప్రారంభమై, కాలక్రమేణా తీవ్రమవుతాయి.
విపరీతమైన దగ్గు: ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది, తరచుగా “పొగాకు దగ్గు” అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఉదయం పూట ఎక్కువగా వస్తుంది.
ఆయాసం: చిన్నపాటి పనులు చేసినా లేదా నడిచినా కూడా ఆయాసం రావడం. వ్యాధి పెరిగే కొద్దీ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా ఆయాసం రావచ్చు.
కఫం పడటం: దగ్గుతో పాటు పసుపు, ఆకుపచ్చ లేదా తెల్లటి కఫం రావచ్చు. దీని పరిమాణం తరచుగా మారుతుంది.
ఛాతీ పట్టేసినట్లు ఉండడం : ఛాతీలో బిగుతుగా లేదా బరువుగా అనిపించడం, ఊపిరి తీసుకోడానికి కష్టంగా ఉండటం.
గుండె దడ: గుండె వేగంగా కొట్టుకోవడం.
నీరసం: తరచుగా అలసటగా, బలహీనంగా అనిపించడం.
బరువు తగ్గటం: అనూహ్యంగా, వివరించలేని విధంగా బరువు కోల్పోవడం.
శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం : శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, పిల్లికూతలు రావడం.
Read Also:Viral Video: ఇది కదా తండ్రి ప్రేమంటే.. ప్రాణాలు లెక్క చేయకుండా కూతురు కోసం.. వైరల్ వీడియో
ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ధూమపానం చేసేవారు, వాయు కాలుష్యానికి గురయ్యేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.