IPL Scam : ఐపీఎల్ సెలక్షన్ పేరుతో ఆశ చూపించి..రూ.23లక్షలు కుచ్చుటోపీ పెట్టిన కేటుగాళ్లు

IPL Scam : కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఒక యువ క్రికెటర్‌ను సైబర్ మోసగాళ్లు దారుణంగా మోసం చేశారు. 19 ఏళ్ల రాకేష్ యదురేకు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ఐపీఎల్ జట్టులో చోటు కల్పిస్తామని నమ్మించి అతడి దగ్గర్నుంచి ఏకంగా 23 లక్షల రూపాయలకు పైగా టోకరా వేశారు. ఈ ఘటనపై బెలగావి జిల్లా సీఈఎన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ మోసగాళ్ల కోసం రాజస్థాన్ వరకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.
చిక్కోడి తాలూకాలోని చిన్చాని గ్రామానికి చెందిన రాకేష్ యదురే ఒక స్టేట్ లెవల్ క్రికెటర్. 2024 మే నెలలో హైదరాబాద్‌లో జరిగిన ఒక టోర్నమెంట్లో అతని అద్భుతమైన ప్రదర్శన సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో రాకేష్‌కు ప్రొఫెషనల్ క్రికెట్లో పెద్ద అవకాశం వస్తుందని ఆశలు రేగాయి. అయితే, 2024 డిసెంబర్లో రాకేష్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ వచ్చింది. అందులో “రాజస్థాన్ రాయల్స్ జట్టులో మీకు చోటు దక్కింది” అని ఉంది. ఆ మెసేజ్‌లో ఒక ఫారమ్‌ను నింపి మొదట రూ.2,000 ఫీజు చెల్లించమని కోరారు.
Read Also:Katrina Kaif : సల్మాన్-రణ్బీర్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? షాకింగ్ ఆన్సర్ చెప్పిన కత్రినా
రాకేష్ ఇది నిజమని నమ్మి, ఫారమ్ నింపి డబ్బులు కట్టాడు. ఆ తర్వాత మోసగాళ్లు అతనితో నిరంతరం సంప్రదిస్తూ ప్రతి మ్యాచ్‌కి రూ.40,000 నుంచి రూ.8 లక్షల వరకు ఫీజు ఇస్తామని హామీ ఇచ్చారు. 2024 డిసెంబర్ 22 నుంచి 2025 ఏప్రిల్ 19 వరకు రాకేష్ చాలాసార్లు ఆన్లైన్ పేమెంట్ల ద్వారా మొత్తం రూ.23,53,550 ట్రాన్స్ ఫర్ చేశాడు. చివరికి, మోసగాళ్లు అదనంగా రూ.3 లక్షలు డిమాండ్ చేయగా, ఎలాంటి కిట్, జెర్సీ లేదా టికెట్లు పంపకపోవడంతో రాకేష్‌కు తాను మోసపోయానని అర్థమైంది. ఆ తర్వాత మోసగాళ్లు రాకేష్‌ను అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో బ్లాక్ చేశారు.
రాకేష్ తండ్రి కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. కొడుకు క్రికెట్ కలలను నిజం చేయడానికి అతను దాదాపు రూ.24 లక్షలు అప్పు చేసి మరీ సమకూర్చాడు. ఈ మొత్తాన్ని సమకూర్చడానికి ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. బెలగావి పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ భీమాశంకర్ గులేద్ మాట్లాడుతూ..డబ్బులు జమ కాగానే మోసగాళ్లు వెంటనే వాటిని డ్రా చేసుకున్నారని, ఇప్పుడు వారి ఖాతాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో మోసగాళ్లు రాజస్థాన్ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించినట్లు తేలింది. సైబర్ క్రైమ్ టీమ్ అక్కడికి వెళ్లి దర్యాప్తు చేయనుంది. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read Also:Viral Video : రోడ్డుపై విచిత్ర స్టంట్లు.. యమరాజుకు మేనల్లుడే వీడు అంటున్న నెటిజన్లు