Danionella cerebrum: ఈ చేప సైజ్ చిన్నదే.. కానీ ఇది చేసే సౌండ్ తెలిస్తే షాక్

Danionella cerebrum: ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఊహించని విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాంటిదే మయన్మార్ దేశంలో ఇటీవల కనుగొన్న ఒక చిన్న చేప. దీని గురించి సైంటిస్టులు ఆసక్తికర విషయాలు చెబుతున్నారు. ఈ చిన్న చేప దాని పరిమాణానికి మించి, ఊహించని విధంగా పెద్ద శబ్దం చేయగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. మయన్మార్ నదులలో నివసించే డానియోనెల్లా సెరెబ్రమ్ (Danionella cerebrum) అనే చేప చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. దీని పొడవు కేవలం 12 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే ఇది మన వేలి గోరు కన్నా చిన్నగా ఉంటుందని చెప్పవచ్చు. ఇంత చిన్న చేప ప్రపంచంలోనే అత్యంత బిగ్గరగా శబ్దం చేసే జీవులలో ఒకటిగా నిలిచిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ చిన్న చేప సృష్టించే శబ్దం దాదాపుగా 140 డెసిబుల్స్ వరకు ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. 140 డెసిబుల్స్ శబ్దం అంటే.. ఒక తుపాకీ పేలినప్పుడు వచ్చే శబ్దంతో గానీ లేదా అంబులెన్స్ సైరన్ మోగినప్పుడు వచ్చే శబ్దంతో గానీ సమానం. ఒక చిన్న చేప ఇంత పెద్ద శబ్దాన్ని ఎలా చేయగలుగుతుందని చాలా మంది ఆశ్చర్య పడుతున్నారు.
Read Also:World Brain Tumor Day : ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌ను ఎలా గుర్తించాలి? – నిపుణుల సలహాలు!
ఇంత చిన్న చేప ఇంత పెద్ద శబ్దాన్ని ఎలా చేయగలుగుతుందని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మగ డానియోనెల్లా సెరెబ్రమ్ చేపలకు ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణంలో ఒక పక్క ఎముక (రిబ్), ఒక మృదులాస్థి (కార్టిలేజ్), ఒక ప్రత్యేకమైన కండరం ఉంటాయి. ఈ కండరం చాలా వేగంగా పనిచేస్తుంది. ఈ కండరం సహాయంతో మగ చేపలు తమ పక్క ఎముకను (రిబ్‌ను) గాలి సంచి (ఎయిర్ బ్లాడర్)కి వ్యతిరేకంగా చాలా వేగంగా కదుపుతాయి. ఈ వేగవంతమైన కదలిక వల్లే అంత పెద్ద శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక రకమైన ‘డ్రమ్మింగ్’ మెకానిజం లాగా పనిచేస్తుంది. ఒక సెకనులో చాలా సార్లు ఈ కదలిక జరగడం వల్ల నిరంతరం పెద్ద శబ్దం వస్తుంది. అయితే ఈ చేపలు ఎందుకు ఇంత పెద్ద శబ్దం చేస్తాయనే దానిపై శాస్త్రవేత్తలకు ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. మయన్మార్‌లోని నదులు కొన్నిసార్లు చాలా బురదగా, మసకబారి ఉంటాయి. అలాంటి చోట్ల ఈ పెద్ద శబ్దం చేపలకు మార్గాన్ని కనుగొనడానికి లేదా తమ చుట్టూ ఉన్న పరిసరాలను తెలుసుకోవడానికి కష్టం. అయితే ఇవి శబ్దం ద్వారా అవి తమ దారిని గుర్తించుకోవచ్చు. మగ చేపలు తమ ప్రాంతంలోకి ఇతర మగ చేపలు రాకుండా హెచ్చరించడానికి ఈ శబ్దాన్ని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. డానియోనెల్లా సెరెబ్రమ్ వంటి చిన్న జీవులు కూడా ప్రకృతిలో ఎంత అద్భుతమైన, విచిత్రమైన సామర్థ్యాలను కలిగి ఉంటాయి. అందుకే ఇవి పెద్ద శబ్ధం చేసి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.