Knee Health Tips: 30 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులా? భవిష్యత్తులో మోకాలి మార్పిడి లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ?

Knee Health Tips: మీ వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండి ఇప్పుడే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? అయితే ఇది భవిష్యత్తులో చాలా అనారోగ్యాలకు దారి తీసే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి నొప్పులు ఎందుకు వస్తాయి. వాటిని ఎలా నివారించాలో తప్పకుండా తెలుసుకోవాలి. సాధారణంగా మోకాళ్ళ నొప్పులు శరీరంలో విటమిన్ డి, కాల్షియం లోపం వల్ల వస్తాయి. అయితే దీనికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. ఎముకలు ఆస్టియోపొరోసిస్ వల్ల బలహీనపడిన వారికి కూడా మోకాళ్ళ నొప్పి ఉండొచ్చు.
ఒక వ్యక్తి మోకాళ్ళ దగ్గర ఉండే మెనిస్కస్ చిరిగిపోతే కూడా మోకాళ్ళ నొప్పి రావొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మెనిస్కస్ అనేది గట్టిగా, రబ్బర్ లాంటిది. ఇది మీ పిక్క, తొడ ఎముక మధ్య షాక్ అబ్జార్బర్ (అఘాత నిరోధకం) లాగా పనిచేస్తుంది. మీ మోకాలిపై బరువు వేసి, దానిని అకస్మాత్తుగా వంచితే ఇది చిరిగిపోవచ్చు. దీని వల్ల మోకాళ్ళలో తీవ్రమైన నొప్పి వస్తుంది. అది చాలా కాలం ఉంటుంది.
మోకాళ్ళ నొప్పికి మరో కారణం బర్సాలో వాపు రావడం. బర్సా అనేది చిన్న ద్రవ సంచులు. ఇవి మీ మోకాలి కీలు బయటి భాగాన్ని కుషన్ లాగా రక్షిస్తాయి. తద్వారా టెండన్లు, లిగమెంట్లు కీలుపై సులభంగా కదలగలవు. వీటిలో గాయం జరిగినా మోకాళ్ళ నొప్పి వస్తుంది. కొంతమందికి క్రీడలు ఆడేటప్పుడు మోకాళ్ళలో పటేల్లార్ టెండినైటిస్ వస్తుంది. టెండినైటిస్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టెండన్‌లలో మంట, వాపును కలిగిస్తుంది. స్కీయింగ్ చేసేవారు, సైకిల్ నడిపేవారు, దూకే క్రీడలు, కార్యకలాపాలలో పాల్గొనే వారికి పటేల్లార్ టెండినైటిస్ రావచ్చు. దీని వల్ల మోకాళ్ళ నొప్పి వస్తుంది.
Read Also:Instagram : మీరు ఇన్‌స్టాగ్రామ్ యూజరా? ఈ కొత్త ఫీచర్‌తో రూ.16లక్షలు సంపాదించవచ్చు!
విటమిన్ డి, కాల్షియం లోపం
మీకు మోకాళ్ళ నొప్పి సమస్య ఉంటే ముందుగా మీ శరీరంలో విటమిన్ డి, కాల్షియం లెవల్స్ టెస్ట్ చేయించుకోవాలి. చాలా మందిలో విటమిన్ డి , కాల్షియం లోపం వల్ల కూడా మోకాళ్ళ నొప్పి ఉంటుంది. ఒకవేళ ఇవి శరీరంలో తక్కువగా ఉంటే, డాక్టర్ సలహా మేరకు వాటి సప్లిమెంట్లను తీసుకోవాలి. కోర్స్ పూర్తి చేయాలి.
మోకాళ్ళ నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
* బరువును అదుపులో ఉంచుకోండి: అధిక బరువు మోకాళ్ళపై భారాన్ని పెంచుతుంది.
* ప్రతిరోజూ వ్యాయామం చేయండి: మోకాళ్ళ కండరాలను బలంగా ఉంచే వ్యాయామాలు చేయండి.
* నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు సరైన భంగిమలో ఉండండి: మీ భంగిమ సరైనది కాకపోతే మోకాళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది.
* మంచి కుషనింగ్ ఉన్న బూట్లు ధరించండి: సరైన బూట్లు మోకాళ్ళపై పడే ఒత్తిడిని తగ్గిస్తాయి.
* ఆహారంలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోండి: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పండ్లు, కూరగాయలు వంటివి తినాలి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి.
* తగినంత విశ్రాంతి తీసుకోండి, కనీసం 7 గంటలు నిద్రపోవాలి : విశ్రాంతి కండరాలు, కీళ్ళు కోలుకోవడానికి సహాయపడుతుంది.
ఈ జాగ్రత్తలు పాటిస్తే, మోకాళ్ళ నొప్పులను నివారించడమే కాకుండా, వృద్ధాప్యంలో మోకాళ్ళ మార్పిడి అవసరాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
Read Also:Trivikram-Poonam Kaur: త్రివిక్రమ్‌పై మరోసారి మండిపడ్డ పూనమ్.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ..!