Airtel: ఆన్‌లైన్ మోసగాళ్లకు షాక్.. ఎయిర్‌టెల్ అదిరిపోయే ఫీచర్
Airtel: ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్‌తో అనుసంధానమైన కోట్ల మంది వినియోగదారులను ఆన్‌లైన్ మోసాలు, స్పామ్ నుంచి సమర్థవంతంగా రక్షించనుంది.

Airtel: డిజిటల్ ప్రపంచం వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. కేవలం నకిలీ కాల్స్, ఓటీపీల ద్వారానే కాకుండా ప్రమాదకరమైన వెబ్‌సైట్లు, వైరస్‌లు, మాల్వేర్‌ల ద్వారా కూడా ప్రజలు మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో తమ వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఒక విప్లవాత్మకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే ‘సురక్షా కవచం’.. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్‌తో అనుసంధానమైన కోట్ల మంది వినియోగదారులను ఆన్‌లైన్ మోసాలు, స్పామ్ నుంచి సమర్థవంతంగా రక్షించనుంది. ఇప్పటికే ప్లాన్స్‌తో పాటు స్పామ్ అలర్ట్‌లను అందిస్తున్న ఎయిర్‌టెల్, ఇప్పుడు మరింత అధునాతనమైన ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్‌ను ప్రారంభించడం విశేషం.
ఎయిర్‌టెల్ ఈ నూతన ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ ఒక లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించబడింది. ఇది ఓటీటీ యాప్‌లు, బ్రౌజర్, ఈమెయిల్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎస్ఎంఎస్ వంటి ఇతర వేదికలపై వచ్చే ప్రమాదకరమైన వెబ్‌సైట్‌లను గుర్తించి, వాటిని నిజ సమయంలో బ్లాక్ చేస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే..ఈ సదుపాయాన్ని ఎయిర్‌టెల్ తన మొబైల్ వినియోగదారులందరికీ, బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లకు ఉచితంగా అందిస్తోంది. దీని కోసం వినియోగదారుల నుంచి ఎటువంటి అదనపు ఛార్జీ వసూలు చేయబడదు. ఎయిర్‌టెల్ ఈ కొత్త వ్యవస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత మల్టీ-లేయర్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుంది. ఈ సిస్టమ్ డొమైన్ ఫిల్టరింగ్ ద్వారా ప్రమాదకరమైన వెబ్‌సైట్‌లను గుర్తించి వాటిని నిరోధిస్తుంది.
ఎయిర్‌టెల్ ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
ఒకవేళ ఎవరైనా వినియోగదారుడు ఎయిర్‌టెల్ అధునాతన భద్రతా వ్యవస్థ ద్వారా ప్రమాదకరమైనదిగా గుర్తించబడిన వెబ్‌సైట్‌ను తెరవడానికి ప్రయత్నిస్తే, ఆ వెబ్‌సైట్ ఓపెన్ కాదు. వినియోగదారుడు ఒక కొత్త పేజీకి టర్న్ అవుతాడు. ఈ కొత్త పేజీలో ఎయిర్‌టెల్ ఆ సైట్‌ను బ్లాక్ చేయడానికి గల కారణాన్ని వినియోగదారులకు తెలియజేస్తుంది. టెలికాం టాక్ నివేదిక ప్రకారం, ఈ సర్వీసు ప్రస్తుతం హర్యానా సర్కిల్‌లోని వినియోగదారులకు అందుబాటులో ఉంచబడింది. అయితే, త్వరలోనే ఈ సర్వీసును దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది.
డిజిటల్ వేదికల విస్తరణతో పాటు ఆన్‌లైన్ మోసాల ముప్పు కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు ఆన్‌లైన్ మోసాలు కేవలం నకిలీ కాల్స్, ఓటీపీలకే పరిమితం కాలేదు. ప్రజలు ప్రమాదకరమైన వైరస్‌లు, మాల్వేర్‌ల ద్వారా కూడా బాధితులు అవుతున్నారు. ఎయిర్‌టెల్ ఈ ‘సురక్షా కవచం’ ఇటువంటి అనేక రకాల ఆన్‌లైన్ మోసాల నుంచి వినియోగదారులను కాపాడుతుందని ఆశిస్తున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడంతో కోట్ల మంది ఎయిర్‌టెల్ వినియోగదారులు ఇకపై ఆన్‌లైన్ భద్రత గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.