Syllabus: సోషల్ సైన్స్, బి.ఏ ఆర్ట్స్ సిలబస్‌లో మార్పులు.. ఎప్పటి నుంచి అమలు కానున్నాయంటే..!

Syllabus: తెలంగాణలో ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ ధోరణులకు అనుగుణంగా ఉన్నత విద్యా మండలి మార్పులు చేర్పులు చేస్తూ చర్చలు జరుపుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం విద్యా మండలి కార్యాలయంలో ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన సబ్జెక్ట్ నిపుణులతో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పలువురు ప్రొఫెసర్స్ పాల్గొనగా సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు బి.ఎ సిలబస్ మార్పులపై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో బి.ఎ సిలబస్ లో మార్పులపై ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సిలబస్ లో మార్పులు చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడైంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, అనుబంధ సంస్థల నుండి సబ్జెక్టు నిపుణులను ఆహ్వానించామని స్వయంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్లో విద్యార్థులకు ప్రపంచ స్థాయి విషయ పరిజ్ఞానం అవసరం అని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కమిటీ సూచనల ప్రకారం 20 నుంచి 30% సిలబస్ ను మార్చాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఈ పురుషోత్తం.. ఉపాధి కోసం పరిశ్రమలకు సంబంధించిన ధోరణిల ప్రకారం బి.ఏ ఆర్ట్స్ సోషల్ సైన్స్ సిలబస్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ఫ్రేమ్ వర్క్, సిలబస్ జాతీయ పోటీ పరీక్షలకు అనుగుణంగా సవరించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్టు వెల్లడించారు. దీనికోసం అన్ని విశ్వవిద్యాలయాలను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఈ మార్పుకు అనుగుణంగా ముందుకు సాగాలంటే 150 క్రెడిట్ ల కోసం సిలబస్ డ్రాఫ్ట్ ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. సెమినార్స్, ప్రాజెక్ట్ ఇంటర్న్ షిప్ లను పాఠ్యాంశాలలో సైతం అమలు చేయాల్సి ఉంటుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి లేటెస్ట్ టెక్నాలజీ ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు అకాడమిక్ స్టాఫ్ కాలేజీలలో విశ్వవిద్యాలయ స్థాయిలో ఓరియంటేషన్ కార్యక్రమాలతో పాటు వర్క్ షాప్స్, రిఫ్రెషర్ కోర్సెస్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టాల్సి ఉంటుందని విద్యా మండలి నిర్ణయించింది. అయితే 2025-26 విద్యా సంవత్సరాలకే ఈ మార్పులను అమలు చేయడానికి వీలుగా సిలబస్ను వీలైనంత త్వరగా సవరించాలని విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ విద్యా మండలి చైర్మన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఈ పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్. కే మహమ్మద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ సబ్జెక్టు నిపుణులతో పాటు కోర్ కమిటీ సభ్యులు సైతం హాజరయ్యారు.