Apple : ముంబైలో యాపిల్ కొత్త స్టోర్ – బెంగళూరులోనూ ప్లాన్.. అద్దె ఎంతో తెలిస్తే గుండె దడేల్ అనాల్సిందే

Apple : భారత మార్కెట్లో యాపిల్ తన విస్తరణను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైలలో యాపిల్ స్టోర్లను ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు కంపెనీ తన తదుపరి కొత్త స్టోర్ గురించి చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం, యాపిల్ త్వరలో ముంబైలోని బోరివలి (ఈస్ట్) లో ఒక కొత్త స్టోర్‌ను తెరవడానికి సిద్ధమవుతోంది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం.. సీఆర్ఈ మ్యాట్రిక్స్ (CRE Matrix), ప్రాప్‌స్టాక్ (Propstack) వెల్లడించిన వివరాల ప్రకారం.. యాపిల్ ఇండియా ముంబైలోని బోరివలిలో 12616 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇది ముంబైలో యాపిల్‌కు రెండో స్టోర్ కానుంది.
Read Also:Viral Video : సినిమా సీన్ తలపించిన ఘటన.. పెళ్లి మండపం నుంచి వధువు సోదరిని తీసుకెళ్లిన ప్రియుడు
ముంబై రెండో స్టోర్ వివరాలు
ముంబైలో యాపిల్ తెరవనున్న ఈ రెండో స్టోర్, ఓబెరోయ్ రియాల్టీకి చెందిన స్కై సిటీ మాల్ లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేయనుంది. ఇన్‌క్లైన్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్‌తో యాపిల్ కుదుర్చుకున్న ఈ లీజు ఒప్పందం మే 8, 2025న జరిగింది. ఈ ఒప్పందం మొత్తం 130 నెలలకు (సుమారు 11 సంవత్సరాలకు) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో యాపిల్‌కు ఐదు రిజర్వ్డ్ పార్కింగ్ స్లాట్లు ,150 చదరపు మీటర్ల అదనపు స్టోరేజ్ స్పేస్ లభిస్తాయి. బోరివలి స్టోర్ కోసం కంపెనీ నెలకు రూ.17.35 లక్షల భారీ అద్దె చెల్లిస్తుంది. అంతేకాకుండా, స్టోర్ కోసం యాపిల్ రూ. కోటి సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించింది. ఈ ఒప్పందంలో రెవెన్యూ షేరింగ్ క్లాజ్ కూడా ఉంది. దీని ప్రకారం, యాపిల్ మొదటి 42 నెలల్లో స్టోర్ ఆదాయంలో 2శాతం చెల్లించాలి, ఆ తర్వాత ఇది 2.5శాతానికి పెరుగుతుంది.
Read Also:Bread : బ్రెడ్ తింటే మలబద్ధకం నుంచి క్యాన్సర్ వరకు ఇన్ని సమస్యలు వస్తాయా.. నిపుణుల సూచన ఇదే !
బెంగళూరులోనూ ప్లాన్!
2023 ఏప్రిల్‌లో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ డ్రైవ్‌లో యాపిల్ తన మొదటి స్టోర్‌ను ప్రారంభించింది. రెండో యాపిల్ స్టోర్ ఢిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ప్రారంభమైంది. ముంబై, ఢిల్లీ తర్వాత ఇటీవల కొన్ని నివేదికల ప్రకారం.. యాపిల్ బెంగళూరులోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో ఒక స్టోర్ కోసం లీజు ఒప్పందంపై సంతకం చేసింది. బెంగళూరు స్టోర్ 7998 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడుతుంది. ఈ స్టోర్ కోసం గత ఏడాది నవంబర్‌లో 10 సంవత్సరాల లీజు ఒప్పందం కుదిరింది. ఈ బెంగళూరు స్టోర్ కోసం యాపిల్ నెలకు రూ.17.44 లక్షల అద్దె చెల్లించాల్సి ఉంటుంది. యాపిల్ భారత్‌లో తన ఉనికిని పెంచుకోవడం ద్వారా భారతీయ కస్టమర్లకు మెరుగైన సేవలందిస్తూ, మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకోవాలని చూస్తోంది.