Mukesh Ambani’s Antilia: రోజుకు 4 వేల రోటీలు, షెఫ్‌కు రూ. 2 లక్షల జీతం.. ఆశ్చర్యపరిచే అంబానీ ఇంటి విషయాలు

Mukesh Ambani’s Antilia: ఆసియాలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నివసించే ‘అంటిలియా’ బిల్డింగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటిగా నిలుస్తుంది. ముంబై దక్షిణ భాగంలో ఉన్న ఈ 27 అంతస్తుల భవనం, దాని ఎత్తైన నిర్మాణం మాత్రమే కాకుండా అందులో ఉన్న అత్యాధునిక సౌకర్యాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. సుమారు 15,000 కోట్ల రూపాయల అంచనా విలువతో ఈ బిల్డింగ్ ఒక లగ్జరీ కోటను తలపిస్తుంది. అయితే, దీని గురించి మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ అంటిలియాలో ప్రతిరోజూ ఏకంగా 4,000 రోటీలు తయారు చేస్తారట.
అంటిలియాలో 600 మంది సిబ్బంది
ఈ అద్భుతమైన భవనంలో సుమారు 600 మందికి పైగా ఉద్యోగులు నిరంతరం అంబానీ కుటుంబ సభ్యుల సేవలో నిమగ్నమై ఉంటారు. ఈ ఉద్యోగుల కోసం ఒక పూర్తి అంతస్తును కేటాయించారు. అందులో వారికి నివాసం, భోజనం, విశ్రాంతి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రతి ఉద్యోగికి ఎయిర్ కండిషన్డ్ గది ఉంటుందంటే, అంబానీ కుటుంబం తమ సిబ్బంది సౌకర్యాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుంది.
రోజుకు వేల రోటీలు
అంటిలియాలోని వంటశాల (కిచెన్) అత్యాధునిక సౌకర్యాలతో కూడి ఉంది. ఇక్కడ వంట చేయడానికి ఒక పూర్తి స్థాయి ప్రొఫెషనల్ టీమ్ పనిచేస్తుంది. కేవలం రోటీల గురించే మాట్లాడితే, నివేదికల ప్రకారం.. ప్రతిరోజూ సుమారు 4,000 రోటీలు తయారు చేస్తారట. ఇందులో కుటుంబ సభ్యులతో పాటు సిబ్బంది, అతిథుల కోసం కూడా ఆహారం ఉంటుంది. రోటీలు చేయడానికి ప్రత్యేకంగా షెఫ్‌లు, వారి బృందాన్ని నియమిస్తారు. సమయం, శ్రమ రెండింటినీ ఆదా చేయడానికి ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తారు.
వంటవారికి లక్షల్లో జీతాలు
అంటిలియాలో ఉద్యోగం పొందాలంటే.. కేవలం హోటల్ మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఉద్యోగం సంపాదించుకోవడానికి రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు వంటి కఠిన ప్రక్రియలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం.. కేవలం రోటీలు చేసే షెఫ్ జీతం నెలకు సుమారు రూ.2 లక్షలు ఉంటుందట. ఇది అంబానీ కుటుంబం శ్రమతో పాటు వృత్తి నైపుణ్యానికి ఎంత విలువ ఇస్తుందో స్పష్టం చేస్తుంది.
Read Also:Telangana: తెలంగాణ విద్యార్థులు ఇది మీకోసమే.. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి
అంటిలియాలో అంతులేని సౌకర్యాలు!
అంటిలియా కేవలం ఒక ఇల్లు కాదు, అది ఒక ప్యాలెస్ (కోట). ఈ భవనంలో మూడు హెలిప్యాడ్లు, 168 కార్లు పార్కింగ్ చేసుకునే సదుపాయం, స్పా, థియేటర్, స్విమ్మింగ్ పూల్ వంటి లెక్కలేనన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విలాసం, రాజభోగాలకు ప్రతీకగా నిలుస్తుంది. అంబానీ కుటుంబం జీవనశైలి, వారి సిబ్బందికి వారు కల్పించే సౌకర్యాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి.