Viral News: హిమాచల్‌లో 60 కోట్ల ఏళ్ల నాటి ‘నిధి’.. శాస్త్రవేత్తల సంచలన ప్రకటన!
Viral News ఈ శిలాజాలు చంబాఘాట్ దగ్గరలోని జోలాజోరాన్ గ్రామంలో దొరికాయి. స్ట్రోమాటోలైట్స్ అంటే సముద్రపు లోతులేని ప్రదేశాలలో సూక్ష్మజీవుల పొరలతో ఏర్పడిన రాతి పొరలు అని డాక్టర్ ఆర్య తెలిపారు.

Viral News : హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన స్ట్రోమాటోలైట్స్ శిలాజాలు బయటపడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శిలాజాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదయ్యాయి. వీటిని టెథిస్ శిలాజాల మ్యూజియం వ్యవస్థాపకుడు డాక్టర్ రితేష్ ఆర్య కనుగొన్నారు. ఈ శిలాజాలు 60 కోట్ల సంవత్సరాల కంటే కూడా పురాతనమైనవని, ఇవి భూమిపై జీవం ఎలా మొదలైందో చెబుతాయని ఆయన అంటున్నారు.
ఈ శిలాజాలు చంబాఘాట్ దగ్గరలోని జోలాజోరాన్ గ్రామంలో దొరికాయి. స్ట్రోమాటోలైట్స్ అంటే సముద్రపు లోతులేని ప్రదేశాలలో సూక్ష్మజీవుల పొరలతో ఏర్పడిన రాతి పొరలు అని డాక్టర్ ఆర్య తెలిపారు. సోలన్ ప్రాంతం ఒకప్పుడు టెథిస్ సముద్రపు అడుగుభాగం అని ఇవి సూచిస్తున్నాయి. ఈ సముద్రం ఒకప్పుడు గోండ్వానా (ఇందులో భారతదేశం, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా ఉండేవి), ఆసియా మధ్య ఉండేది.
డాక్టర్ ఆర్య మాట్లాడుతూ.. భూమి వాతావరణంలో ఆక్సిజన్ లేనప్పుడు, గ్రీన్హౌస్ వాయువులు నిండి ఉన్న సమయంలో, ఈ సూక్ష్మజీవులే దాదాపు 2 బిలియన్ సంవత్సరాలలో నెమ్మదిగా ఆక్సిజన్‌ను తయారు చేయడం ప్రారంభించాయి. దీనివల్లనే తర్వాత జీవం సాధ్యమైందని చెప్పారు. స్ట్రోమాటోలైట్స్ లేకపోతే ఈరోజు ఆక్సిజన్ కూడా ఉండేది కాదని ఆయన అన్నారు. డాక్టర్ ఆర్య ఇంతకు ముందు సోలన్‌లోని ధర్మపూర్ కోటిలో, చిత్రకూట్‌లో, హర్యానాలోని మోర్ని హిల్స్‌లో కూడా వీటిని కనుగొన్నారు. చంబాఘాట్లోని శిలాజాలు వేర్వేరు పొరల నిర్మాణాన్ని కలిగి ఉన్నాయని, ఇది భిన్నమైన పురాతన పర్యావరణ పరిస్థితుల గురించి తెలుపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. హిమాచల్ భూమిలో కోట్ల సంవత్సరాల నాటి సముద్రపు చరిత్ర దాగి ఉందని, దీనిని సంరక్షించి మనం తరువాతి తరాలకు అందించాలని ఆయన అన్నారు.
ఓఎన్‌జిసిలో జనరల్ మేనేజర్‌గా పనిచేసిన డాక్టర్ జగమోహన్ సింగ్ మాట్లాడుతూ.. చంబాఘాట్లోని ఈ స్ట్రోమాటోలైట్స్ భూమిపై జీవం ప్రారంభమవుతున్న యుగానికి మనల్ని తీసుకువెళ్తాయని అన్నారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలోని భూగర్భ శాస్త్ర విభాగాధిపతి, సీనియర్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ (డాక్టర్) అరుణ్ దీప్ అహ్లువాలియా మాట్లాడుతూ.. ఈ శిలాజాలు శాస్త్రీయంగా ముఖ్యమైనవి అని అన్నారు.
డాక్టర్ ఆర్య మాట్లాడుతూ.. ఈ స్థలాన్ని రాష్ట్ర శిలాజ వారసత్వ ప్రదేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తాను డిప్యూటీ కమిషనర్, టూరిజం అధికారికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. దీనివల్ల సైన్స్, సంరక్షణ, జియో టూరిజం అభివృద్ధి చెందుతాయని ఆయన నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.